
బైక్‌ను ఢీకొట్టి.. ముప్పుతిప్పలు పెట్టి
● కారులో పరారైన ఇద్దరు వ్యక్తులు
● పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
● గ్రామస్తులపై ఠాణాలోబాధితుల ఫిర్యాదు
చేవెళ్ల: కారుతో బైక్‌ను ఢీకొట్టి.. మూడు గ్రామాల ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి, పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు. దాడిచేసి, కారును ధ్వంసం చేశారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధి రావుపల్లి గ్రామానికి చెందిన చాకలి రాజు.. బైక్‌పై గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని ఫాంహౌస్‌కు వచ్చిన ఎండీ హస్మతుల్లాఖాన్, ఎండీ నవాజ్ అలీఖాన్‌లు తిరిగి ఇన్నోవా కారులో నగరానికి వెళ్తూ యువుకుడి బైక్‌ను ఢీకొట్టారు. అనంతరం కారును ఆపకుండా వెళ్తుండటంతో గమనించిన స్థానికులు.. ముడిమ్యాల గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో వారు కారును ఆపటానికి యత్నించినా, తప్పించుకొని అతి వేగంతో కుమ్మెర వైపు వెళ్లారు. దీంతో ముడిమ్యాల గ్రామస్తులు.. కుమ్మెర గ్రామస్తులకు విషయం తెలపగా.. వారు కారును అడ్డుకున్నారు. మూడు గ్రామాల వారు ఏకమయ్యారు. జరిగిన సంఘటన గురించి కారులోని వ్యక్తులను ప్రశ్నించగా.. సదరు వ్యక్తులు గ్రామస్తులపై తిరగబడ్డారు. దీంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల ప్రజలు.. కారును ధ్వంసం చేశారు. ఇద్దరిని చితకబాదారు. అనంతరం ప్రమాదానికి కారణమైన వ్యక్తులు.. జరిగిన సంఘటనను వివరిస్తూ గ్రామస్తులపై చేవెళ్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాట్లాడారు. ఎవరైనా తప్పు చేసినా, రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారు పారిపోతున్నా.. వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించాలే కానీ.. దాడి చేయరాదని సూచించారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసు దర్యాప్తులో ఉంది.