
రైలు ఢీకొని యువకుడి మృతి
సికింద్రాబాద్: పట్టాల పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కేతావత్ నారాయణ తెలిపిన మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన సుబోద్ కుమార్(25) గుండ్ల పోచంపల్లిలోని ఫ్యాక్టరీ ఏరియాలో రోజువారి కూలీగా పని చేస్తున్నాడు. ఈ నెల 21న సాయంత్రం కూరగాయలు కొనుగోలు చేసేందుకు పోచంపల్లి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రైలు పట్టాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుకవైపు నుంచి వచ్చిన రైలు సుబోద్ కుమార్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
అక్కినేని నాగేశ్వరరావు గొప్ప నటుడు
చిక్కడపల్లి: అక్కినేని నాగేశ్వర్‌రావు గొప్ప నటుడని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం రాత్రి రసమయి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసురావుకు ‘అక్కినేని జీవితం సాఫల్య పురస్కారం’ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మైన్స్ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, సాహితీవేత్తలు ఎంకే రాము, జంగయ్యగౌడ్, సుబ్బరాయశర్మ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.