
నిధుల గోల్‌మాల్!
నందిగామ: సీ్త్ర నిధి నిధులను వీఓఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్) భర్త పక్కదారి పట్టించాడు. ఈ ఘటన మండల పరిధిలోని వీర్లపల్లిలో 2023 నుంచి 2024 వరకు చోటు చేసుకోగా ఇటీవల వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. వీర్లపల్లిలో 29 మహిళా సంఘాలు ఉన్నాయి. గ్రామంలో వీఓఏగా భవాని విధులు నిర్వర్తిస్తుండగా ఆమె భర్త రమేష్ అన్ని వ్యవహారాలు చూసుకుంటాడు. గ్రామంలోని రోజా, జ్యోతి, శ్రీలక్ష్మి, శ్రీనిత్య, రూప సంఘాలకు సంబంధించి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. తీర్మానాలు చేసి బ్యాంకు ద్వారా మహిళా సంఘం సభ్యుల వ్యక్తిగత ఖాతల్లోకి జమచేయాల్సిన రూ.8.40 లక్షల రుణాలను తన ఖాతాలోకి మళ్లించాడు. విషయం సంఘాల సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అడిగినప్పుడల్లా దాటవేస్తూ వచ్చాడు.
సీ్త్రనిధి నిధులు రూ.27 లక్షలు
మహిళా సంఘాలకు సీ్త్రనిధి బ్యాంకు ద్వారా నిధులు మంజూరు చేస్తుంటారు. మహిళలు సొంత వ్యాపారం, ఉపాధి కోసం రుణాలు తీసుకొని నెలవారీ వాయిదాల రూపంలో బ్యాంకుకు తిరిగి ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ చెల్లింపుల విషయం మహిళా సంఘం సభ్యులకు తెలియకపోవడాన్ని అవకాశంగా మలుచుకున్నాడు. ప్రతి నెల సుమారు రూ.1.55 లక్షల నగదును వారి నుంచి వసూలు చేసి, సీ్త్ర నిధి బ్యాంకులో చెల్లించకుండా మొత్తం రూ.27 లక్షలు సొంతానికి వాడుకున్నాడు.
వెలుగు చూసిందిలా..
ఇటీవల మహిళా సమాఖ్య అధికారులు గ్రామానికి వెళ్లి గ్రామపెద్దల సమక్షంలో రమేష్‌ను పిలిపించి డబ్బుల విషయమై ప్రశ్నించారు. దీంతో మహిళా సంఘం డబ్బులు, సీ్త్రనిధి డబ్బులు మొత్తం రూ. 35 లక్షలు వాడుకుంది నిజమని అంగీకరించాడు. సదరు మొత్తం వీలైనంత త్వరగా కట్టేస్తానని ఓ కాగితం రాసి రెవెన్యూ స్టాంపులు అతికించి సంతకం చేశాడు.
అంతుచిక్కని ప్రశ్నలు
వీఓఏగా భవానీ విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఆమె భర్త ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు.. మహిళా సంఘం సభ్యుల నెలవారీ వాయిదాల డబ్బులు ఏడాది పాటు సొంతానికి వాడుకుంటున్నా ఎందుకు రికవరీ చేయ లేదు అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.
మహిళా సంఘం సభ్యుల డబ్బును సొంతానికి వాడుకున్నట్లు రమేష్ రాసిచ్చిన తీర్మాన పత్రం
ఇటీవలే నందిగామ మండలానికి ఏపీఎంగా కొత్తగా వచ్చాను. వీర్లపల్లి మహిళా సంఘం సభ్యుల డబ్బులు వీఏఓ భర్త సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. అతడి నుంచి ఆ మొత్తం రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
– భగవంతు, ఏపీఎం, నందిగామ మండలం
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం
వీర్లపల్లి మహిళ సంఘం సభ్యుల నుంచి నెలవారీగా వాయిదాలను వసూలు చేసిన వీఏఓ భర్త రమేష్ తిరిగి సీ్త్రనిధి బ్యాంకుకు చెల్లించని విషయం వాస్తవమే. ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశాం.
– రజిత, అసిస్టెంట్ మేనేజర్, సీ్త్రనిధి బ్యాంకు
మహిళా సంఘాల సొమ్ము కాజేసిన వీఓఏ భర్త
మొత్తం రూ.35 లక్షలు పక్కదారి
ఆలస్యంగా వెలుగులోకి..