
రైతులు ఆందోళన చెందొద్దు
ఆమనగల్లు: రైతులు సాగుచేసిన పంటలకు అనుగుణంగా అవసరమైన యూరియా సరఫరా చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు. పట్టణంలోని పీఎసీఎస్, ఆగ్రో రైతు సేవా కేంద్రాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల వద్ద ఉన్న యూరియా నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దని, అవసరమైన నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఆమనగల్లు వ్యవసాయ శాఖ సబ్‌డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల్లో ఉన్న 90 టన్నుల యూరియాను పీఏసీఎస్ కేంద్రాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పది రోజుల నుంచి యూరియా సరఫరా చేస్తున్నామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆమనగల్లు ఏడీఏ శోభారాణి, వ్యవసాయాధికారి కవిత, ఏఈఓలు శ్రీకాంత్‌రెడ్డి, మీనాక్షి, గాయత్రి తదితరులు ఉన్నారు.
సాగుకు అనుగుణంగా యూరియా సరఫరా
జిల్లా వ్యవసాయాధికారి ఉష