
అమావాస్య రోజు శవం రావొద్దంటూ..
● అడ్డుకున్న స్థానికులు
● మరోచోట అంత్యక్రియలు
కొత్తూరు: అమావాస్య రోజు తమ తండాలోకి శవం రావొద్దంటూ అడ్డుకున్న సంఘటన మండలంలోని మల్లాపూర్‌తండాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన కిషన్‌నాయక్, విజయలక్ష్మి(35) భార్యాభర్తలు. వీరు కొన్నేళ్లుగా శంషాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కిషన్‌నాయక్ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. మూడు రోజుల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంతో విజయలక్ష్మి పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమి త్తం ఉస్మానియాకు తరలించగా ఆదివారం ఉద యం ఆమె మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని మల్లాపూర్‌తండాకు తీసుకువస్తుండగా అమవాస్య కావడంతో కొందరు తండావాసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు శంషాబాద్ మండలం రామానుజపూర్ గ్రామంలో ఉన్న వారి పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయమై సీఐ నర్సింహారావును వివరణ కోరగా.. బాధిత కుటుంబ సభ్యుల ఇష్టంతోనే రామానుజాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. అంత్యక్రియలు అడ్డుకున్నారని ఫిర్యాదు ఇస్తే విచారణ జరుపుతామని పేర్కొన్నారు.