
తనయుడి చేతిలో తల్లి హత్య!
చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్‌లో ఘటన
చేవెళ్ల: కన్నతల్లిని కర్కశంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన చేవెళ్ల పీఎస్ పరిధిలోని రేగడిఘనాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొంగుపల్లి నర్సమ్మ (70)కు నలుగురు కొడుకులు. అందరికీ వివాహాలు కాగా వేర్వేరుగా జీవిస్తున్నారు. భర్త చనిపోవటంతో వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. మూడో కొడుకు జంగయ్య పెళ్లి చేసుకుని, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడిచిట్టెంపల్లికి ఇల్లరికం వెళ్లాడు. సొంత మామ(భార్య తండ్రి) హత్య ఘటనలో ఇతనిపై కేసు నమోదైంది. దీంతో భార్యతో గొడవ పడి ఆర్నెళ్లుగా స్వగ్రామానికి వచ్చి తల్లితోనే ఉంటున్నాడు. గతంలో చేసిన ప్రేవేటు ఉద్యోగం మానేసి, తాగుడుకు బానిసయ్యాడు. ఇదిలా ఉండగా గత శుక్రవారం రాత్రి బాగా తాగి వచ్చి మత్తులోనే నిద్రపోయాడు. శనివారం మధ్యాహ్నం వరకూ తల్లీకొడుకులు బయటకు రాలేదు. మద్యం మత్తు కాస్త దిగిన తర్వాత 3:30 గంటలకు బయటకు వచ్చి తల్లి చనిపోయిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా హత్యకు గురైనట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో దాడికి పాల్పడిన కొడవలిని పోలీసులు స్వాధీనం చేసుకుని, జంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. జంగయ్య ఇప్పటికీ మద్యం మత్తులోనే ఉన్నాడని, ఇంకా ఎలాంటి విషయాలు చెప్పలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.