
నిర్లక్ష్యాన్ని ఏమనాలా?
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్‌లోని అపిల్ అవెన్యూ కాలనీలో మాసబ్ చెరువు వాగుపై నిర్మించిన నాలా నెర్రెలు బారింది. కూలడానికి సిద్ధం అన్నట్లు ఉన్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాగుపై నిర్మాణం కాబట్టి ఇరిగేషన్ శాఖ చూడాలని మున్సిపల్ అధికారులు.. వెంచర్ ఏర్పాటై ఇళ్లు నిర్మాణమైనందున మున్సిపల్ అధికారులదే బాధ్యత అని ఇరిగేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెబుతూ చేతులు దులుపుకొంటున్నారు. దీంతో సమస్య ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
వాగును నాలాగా మార్చడంతో..
2015లో వెంచర్ చేసిన నిర్వాహకులు పెద్ద వాగును చిన్న నాలాలా మార్చారు. ఫలితంగా అలుగు పారినప్పుడల్లా రెండు వైపులా రాకపోకలు నిలిచిపోతున్నాయి. వరద సహజ సిద్ధంగా ప్రవహించే అవకాశం లేకపోవడంతో నాలాపై ప్రవహిస్తోంది. దీనిపై వేసిన స్లాబ్‌ను సీసీ రోడ్డుగా మార్చారు. వాగుకు రెండు వైపులా ఉన్న ఇళ్లకు వెళ్లడానికి ఇదే మార్గం. 2020 అక్టోబర్ 12న కురిసిన భారీ వర్షంతో రాత్రికిరాత్రే చెరువు ఉప్పొంగడంతో వాగు ఉధృతంగా ప్రవహించి ఇళ్లను ముంచెత్తిన విషయం విదితమే. తరువాత ఏటా కురుస్తున్న వర్షాలతో మూడు, నాలుగు నెలలకుపైగా నాలా నుంచి నీరు ప్రవహిస్తోంది. నెర్రెలు బారి కూలడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రెండు వైపులా నీరు ప్రవహించే చోట కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని శ్రీసాక్షిశ్రీ ముందే హెచ్చరించింది.
తెరుచుకున్న మ్యాన్ హోళ్లు
ఇటీవల జీహెచ్‌ఎంసీ పరిధిలోని మల్లేపల్లిలో అర్జున్, రాము అనే యువకులు, ముషీరాబాద్‌లో సన్నీ అనే యువకుడు భారీ వర్షాలతో వచ్చిన వరద నీటి కారణంగా నాలాలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. వారి జాడ కోసం అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా అధికారుల్లో చలనం రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాసబ్ చెరువు వాగుపై నిర్మించిన నాలా నిండుగా ప్రవహిస్తున్నా మ్యాన్‌హోళ్లపై కనీసం మూతలు కూడా పెట్టలేదు. ఒకటి రెండు చోట్ల పెట్టినా వరద ఉధృతికి అవి తట్టుకోవడం లేదు. ఇక్కడ నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో పాటు చుట్టు పక్కల ఇళ్లలో నివసించే పిల్లలు ఆడుతూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగాక విచారించే బదులు ముందస్తుగా స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
సహజసిద్ధంగా ఏర్పడిన వాగుపై నాలా నిర్మించడమే తప్పు. గతంలో వెంచర్ చేసిన నిర్వాహకులు వరద నీటి కోసం నాలా నిర్మించారు. పదేళ్లు కూడా కాకముందే నెర్రెలు బారిన మాట వాస్తవమే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. నిర్మాణంపై మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకోవాలి.
– వంశీ, ఏఈఈ, ఇరిగేషన్
ప్రస్తుతం ఉన్న నాలా వరుసగా కురుస్తున్న వర్షాలతో కొంత మేర ధ్వంసమైంది. రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు తెరుచుకున్న మ్యాన్‌హోళ్లను వెంటనే మూసివేయిస్తాం. వర్షాల వేళ ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి.
– కె.అమరేందర్ రెడ్డి, కమిషనర్,
తుర్కయంజాల్ మున్సిపాలిటీ
మాసబ్ చెరువు వాగుపై నెర్రెలుబారిన నాలా
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు
పొంచి ఉన్న ప్రమాదం
పట్టించుకోని అధికారులు

నిర్లక్ష్యాన్ని ఏమనాలా?

నిర్లక్ష్యాన్ని ఏమనాలా?

నిర్లక్ష్యాన్ని ఏమనాలా?