
‘బినామీ’ పనులు!
బినామీ కాంట్రాక్టర్లు చేపట్టిన పనులకే ఎల్సీలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నానక్‌రాంగూడలోని ఓ కాన్సులేట్ కార్యాలయం విద్యుత్ కనెక్షన్ కోసం ఆరేళ్ల క్రితం కేటగిరీ–2 కింద డిస్కంకు దరఖాస్తు చేసుకుంది. ఖరీదైన పనులను తమ ఖాతాలో వేసుకోవాలని అప్పటి ఇంజనీర్లు భావించారు. ప్రాజెక్ట్స్ విభాగం చేపట్టాల్సిన పనులను నిబంధనలకు విరుద్ధంగా నాటి ఆపరేషన్స్ విభాగం చేజిక్కించుకుంది. అధికారులు ఎక్కడా తెరపై కనిపించకుండా బినామీ కాంట్రాక్టర్‌ను రంగంలోకి దింపారు. నానాక్‌రాంగూడ 33 కేవీ సబ్‌స్టేషన్ నుంచి 26 కిలోమీటర్లు, గచ్చిబౌలి 220 కేవీ సబ్‌స్టేషన్ నుంచి 12.09 కిలోమీటర్లు యూజీ కేబుల్ వేయాలని నిర్ణయించి.. ఆ మేరకు లైన్ ఫీజుబులిటీ, లోడును సాకుగా చూపించి అంచనాలను అమాంతం పెంచేశారు. యూజీ కేబుల్స్ కోసం డిగ్గింగ్ వర్క్స్ చేయకుండానే చేసినట్లు రికార్డులు చూపించారు. పనులు చేసేది, పర్యవేక్షించేది అధికారులే కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా అదే మార్గంలో ఓ ప్రైవేటు డేటా సెంటర్ కోసం తవ్విన స్ట్రంచ్(లైన్) నుంచే సదరు కాన్సులేట్‌కు కేబుళ్లను వేశారు. అప్పట్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. డీటీఆర్ చార్జింగ్ ప్రక్రియ మూడేళ్ల క్రితమే పూర్తయింది. ఇలా మిగిల్చిన దాంట్లో క్షేత్రస్థాయిలోని నాటి డీఈ మొదలు.. ఓ రిటైర్డ్ డైరెక్టర్ స్థాయి అధికారి వరకు భారీగా లబ్ధిపొందినట్లు ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చిన ఏడీఈ పనులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ డిపాజిట్ రూ.31.61 లక్షలు తిరిగి చెల్లించాలంటే.. వేసినట్లు చెబుతున్న భూగర్భలైన్‌ను తవ్వి చూపించాల్సిందేనంటూ పట్టుబట్టారు. తవ్వితే అక్రమాలు ఎక్కడ భయటపడతాయో అనే భయంతో సదరు బినామీ కాంట్రాక్టర్ ఆ డిపాజిట్ జోలికే వెళ్లలేదు.
రూ.లక్షల్లో వేతనాలు..అయినా అడ్డదారులు
గ్రేటర్ జిల్లాల పరిధిలో మూడు జోన్లు, తొమ్మిది సర్కిళ్లు, 26 డివిజన్లు, 65 ఆపరేషన్స్ సబ్ డివిజన్లు, 213 ఆపరేషన్ సెక్షన్లు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పని చేసే ఆర్టిజన్ కార్మికులు వేతనాలు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండగా, రెగ్యులర్ జూనియర్ లైన్‌మెన్‌లు, లైన్ ఇన్‌స్పెక్టర్ల జీతాలు సీనియార్టీని బట్టి రూ.లక్ష వరకు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్ల(ఏఈ) వేతనాలు రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు ఉండగా, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు(ఏడీఈ), డివిజనల్ ఇంజినీర్ల(డీఈ) జీతాలు రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు ఉంటాయి. సూపరింటెండింగ్ ఇంజనీర్లు (ఎస్‌ఈలు), చీఫ్ ఇంజనీర్ల (సీఈ)ల వేతనం రూ.7 లక్షలకుపైగా ఉంటోంది. ఒకవైపు రూ.లక్షల్లో వేతనాలు పొందుతూనే మరోవైపు గుట్టుగా ప్రైవేటు పనులు చేపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో బినామీ పనులు చేయిస్తున్నారు. తొలుత నామినేటెడ్ పద్ధతిలో చిన్నచిన్న పనులు కేటాయించి, తర్వాత తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ మొత్తంలో దక్కించుకుంటున్నారు. విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న హైరేజ్ బిల్డింగ్స్, మల్టీ స్టోరేజ్ భవనాలు, పరిశ్రమల యజమానులకు లైన్ ఫీజుబులిటీ, లోడు సాకుగా చూపించి.. తక్కువకు అయ్యే పనులకు ఎక్కువ మొత్తంలో అంచనాలు రూపొందిస్తున్నారు. అనంతరం బినామీలకు ఆయా దరఖాస్తుదారుల ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు ఇచ్చి రీ ఎస్టిమేషన్ల పేరుతో మళ్లీ అదే పనికి తక్కువ ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఆయా భవనాలు/పరిశ్రమ యజమానులు వీరికి తలొగ్గక తప్పని పరిస్థితి తలెత్తుతోంది. ఇలా ఆపరేషన్స్ విభాగంలోని ఏఈ, డీఈలే కాదు సాధారణ ఆర్టిజన్ సైతం కోట్లకు పడగెత్తారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అడ్డగోలుగా సంపాదనకు అలవాటు పడిన ఇంజినీర్లు.. తర్వాత ఫోకల్ పోస్టులకు భారీగా ఖర్చు చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాదించేందుకు మళ్లీ అడ్డదారులు తొక్కుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఇంజినీర్లపై ఏసీబీ దాడులు చేస్తుండటం, సీఎంఓ ఆరా తీస్తుండటంతో ఆయా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
డిస్కం వర్కుల్లో ఇంజినీర్ల బంధుగణం
ఆన్‌లైన్ టెండర్లే కాదు ప్రైవేటు పనులూ వారికే
ఒక్కో సెక్షన్‌కు ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు
ఏసీబీ దాడులు.. సీఎంఓ ఆరాతో ఉక్కిరిబిక్కిరి
అంచనాల రూపకల్పన, ఆన్‌లైన్ టెండర్ల దాఖలు, పనుల కేటాయింపు, పర్యవేక్షణ సహా మీటర్ల మంజూరు, డీటీఆర్ చార్జింగ్ ఇలా అన్ని తామే చూసుకుంటామని హామీ ఇస్తుండటంతో ఆయా భవన/ పారిశ్రామిక యజమానులు వీరికి పనులు కట్టబెడుతున్నారు. ఏఈ పరిధిలో సెక్షన్ కాంట్రాక్టర్లు, డీఈ పరిధిలో 33 కేవీ కాంట్రాక్టర్లు పని చేస్తుంటారు. ఆన్‌లైన్ టెండర్ ద్వారా చేపట్టాల్సిన డిపార్ట్‌మెంట్ పనులను సైతం ఎమర్జెన్సీ వర్కుల పేరుతో బినామీలతో చేయిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు లైసెన్సులు లేని వ్యక్తులు కూడా పనులు చేసుకునే వారు. వీరంతా తమకున్న అనుభవం, అర్హతను బట్టి పనులు చేసేవారు. ఇటీవల ప్రభుత్వం పలు మార్పులు చేసింది. విద్యుత్ పనులు చేయాలంటే ఎలక్ట్రిల్ లైసెన్సింగ్ బోర్డు గుర్తింపు పొందిన వ్యక్తితో మాత్రమే పనులు చేయించాలనే నిబంధన విధించింది. ప్రతి కాంట్రాక్టర్ ఆన్‌లైన్ వెండర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. డిస్కం పరిధిలో మూడు వేలకుపైగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు ఉండగా, కొద్ది మందికి మాత్రమే పనులు దక్కుతున్నాయి. ఆన్‌లైన్‌లో తక్కువకు కోట్ చేసిన వారికి పనులు ఇవ్వకుండా వివిధ సాంకేతిక అంశాలను కారణంగా చూపించి, అవే పనులను బినామీలకు కట్టబెడుతున్నారు. ఇలా ఒక్కో సెక్షన్‌కు ఇద్దరు బినామీ కాంట్రాక్టర్లు ఉన్నట్లు తెలిసింది. బినామీ కాంట్రాక్టర్లకు ఎల్సీలు ఇస్తూ.. ఇతరులు చేసిన పనులకు ఇవ్వడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. సకాలంలో డీటీఆర్ ఛార్జింగ్ చేయించకపోవడంతో బిల్డర్లు తమతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారు. ఫలితంగా ఏళ్లుగా చిన్నచిన్న పనులు చేసుకుని బతికిన వాళ్లు ప్రస్తుతం బినామీలతో పోటీ పడలేకపోతున్నారు.