
న్యాయం చేయండి
కడ్తాల్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను హైదరాబాద్ ప్రజాభవన్‌లో మండల పరిధిలోని అన్మాస్‌పల్లి, జమ్ములాబావితండాకు చెందిన చెంచు రైతులు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆమెకు వివరించారు. 1988లో అప్పటి ప్రభుత్వం అన్మాస్‌పల్లి, జమ్ములాబావితండాకు చెందిన 27 మంది రైతులకు 54 ఎకరాలు కేటాయించిందని తెలిపారు. నాటి నుంచి తామే సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. 30 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న తమ భూములకు భూ భారతిలో పట్టాలిప్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన మంత్రి కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి న్యాయం చేయాలని సూచించారు.
తుర్కయంజాల్: పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్‌లో ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న సీపీఐ జాతీయ మహాసభలకు ప్రతినిధిగా జిల్లా నుంచి ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభల్లో దేశ రాజకీయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ అభివృద్ధి, అంతర్జాతీయ పరిస్థితులు, కార్పొరేట్ శక్తుల ప్రభావం, మత రాజకీయాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సభల్లో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
కడ్తాల్: కేసుల నమోదు.. దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకతతో వ్యవహరించాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల నమోదు ప్రక్రియ, సిబ్బంది పనితీరు, కేసుల పురోగతిని పరిశీలించారు. పోలీసు సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలతో ఠాణాను ఆశ్రయించే ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ గంగాధర్, ఎస్‌ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు నేరాలను అరికట్టవచ్చని శంషాబాద్ డీసీపీ రాజేశ్ అన్నారు. మండల పరిధిలోని చరికొండలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను శనివారం వారు ప్రారంభించారు. అదే విధంగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ గంగాధర్, ఎస్‌ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్‌లో హైడ్రా అధికారులు పర్యటించారు. హైడ్రా సీఐ పి.తిరు మలే ష్ కొంగరకలాన్‌లోని ఐరా స్వ్కేర్ రియల్ ఎస్టేట్ సంస్థలో దేవరకొండ నక్ష రోడ్డు ఆక్రమించి గోడలు నిర్మించారని, పక్కనే ఉన్న శ్లోకా కన్వెన్షన్ హాల్ యజమాని మున్సిపాలిటీకి గిఫ్ట్‌డీడ్ చేసిన విలువైన స్థలాన్ని కబ్జా చేశారని కొంగరకలాన్‌కు చెందిన కొంతమంది హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శని వారం పర్యటించిన అధికారులు రెండు చోట్ల వివరాలు సేకరించారు. యాజమాన్యాన్ని పిలిచి కార్యాలయానికి విచ్చేసి సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు.

న్యాయం చేయండి