
బాచుపల్లిలో బోసిపోయి..
● తుర్కయంజాల్‌లో కేవలం 2 ప్లాట్‌లకే బేరం
● హెచ్‌ఎండీఏ భూములకు స్పందన శూన్యం
సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌ఎండీఏ భూములపై కొనుగోలుదారులు విముఖత చూపారు. బాచుపల్లిలో మొత్తం 70 ప్లాట్‌లకు ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించగా ఒక్క ప్లాట్ కూడా విక్రయించలేకపోయారు. తుర్కయంజాల్‌లో 12 ప్లాట్‌లలో కేవలం 2 మాత్రమే అమ్ముడయ్యాయి. గజానికి రూ.65,000 కనీస ధర నిర్ణయించగా రూ.1.15 లక్షలకు గజం చొప్పున ఒక ప్లాట్‌ను, రూ.75,000కు గజం చొప్పున మరో ప్లాట్‌ను విక్రయించారు. బాచుపల్లిలో కనీసం బోణీ కూడా కాకపోవడంతో హెచ్‌ఎండీఏ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
రూ.600 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని..
సుమారు రెండేళ్ల విరామం తర్వాత భూముల అమ్మకాలకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) శ్రీకారం చుట్టింది. ఈ రెండు చోట్ల ఉన్న స్థలాలతో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా మిగిలిపోయిన స్థలాల అమ్మకాల ద్వారా దాదాపు రూ.600 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో మూడు రోజుల పాటు ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణరంగానికి చెందిన సంస్థల నుంచి, అటు మధ్యతరగతి వర్గాల నుంచి స్పందన కనిపించలేదు. హెచ్‌ఎండీఏ ప్లాట్‌లు కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు. ప్లాట్‌ల వేలానికి ముందు నిర్వహించిన ప్రీబిడ్డింగ్ సమావేశాల్లోనూ కొనుగోలుదారుల నుంచి స్పందన లభించకపోవడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత కారణంగా విక్రయించలేకపోయినట్లు అధికారులు తెలిపారు.
ధరలు ఎక్కువే..
రెండు చోట్ల హెచ్‌ఎండీఏ నిర్ణయించిన బేసిక్ ధర లపై మొదటి నుంచీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తుర్కయంజాల్‌లో చదరపు గజానికి రూ.65,000 చొప్పున ధర నిర్ణయించారు. ప్రస్తుత స్తబ్ధత కారణంగా మార్కెట్ ధరల కంటే ఇవి ఎక్కువే. ప్రస్తుతం అక్కడ గజానికి రూ.40,000 నుంచి రూ.45,000 ధర ఉన్నట్లు అంచనా. కానీ.. హెచ్‌ఎండీఏ అధికారులు కనీస ధరలను అమాంతం పెంచారు. ఒక్కోప్లాట్ కనిష్టంగా 600 గజాల నుంచి 1,146 గజాల వరకు మొత్తం 12 ప్లాట్‌లు ఉన్నాయి. వీటి పరిమాణాలు నాలుగు వైపులా సమంగా లేకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రాలేదని తెలిసింది. బాచుపల్లిలోని స్థలాలకు గజానికి రూ.70,000 చొప్పున కనీస ధరను నిర్ణయించారు. కానీ.. స్థానికంగా ఉన్న మార్కెట్ ధరల కంటే ఎక్కువేననే అభిప్రాయం ఉంది. కనిష్టంగా 266.67 గజాల నుంచి గరిష్టంగా 499.96 గజాల వరకు ఈ ప్లాట్ సైజ్‌లు ఉన్నాయి. ఈ లే అవుట్‌కు సరైన అప్రోచ్ రోడ్ లేకపోవడం ఒక లోపమనే చెప్పాలి.