
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఇబ్రహీంపట్నం రూరల్: కొత్తగా మహిళా స్వయం శక్తి సంఘాలను ఏర్పాటు చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటనారాయణ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం 18 మున్సిపాలిటీల్లో పని చేస్తున్న టౌన్ మిషన్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రిసోర్సు పర్సన్లకు అవగాహన, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వీధి వ్యాపారులకు అందించాల్సిన సౌకర్యాలపై అదనపు మిషన్ డైరెక్టర్ మెప్మా మురళీ మోహన్, స్టే అధికారి కృష్ణ చైతన్య అవగాహన కల్పించారు. మహిళా సంఘాలకు రుణాల టార్గెట్, అచీవ్‌మెంట్ గురించి వివరించారు. కార్యక్రమంలో డీఎంసీ ఇందిర, ఏడీఎంసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పహాడీషరీఫ్: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ ఎస్‌ఐ ఎ.ఎ.రాజును రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అభినందించారు. ఈ మేరకు శుక్రవారం సేవా పతకం అందజేశారు. కత్తి మీది సాము లాంటి పోలీస్ శాఖలో ఎలాంటి రిమార్క్‌లు లేకుండా ముందుకు సాగుతూ ఇ లాంటి పురస్కారాలు అందుకోవడాన్ని మిగ తా సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
షాద్‌నగర్: షాద్‌నగర్ పోక్సో కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది సబియా సుల్తానాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డిని నియమించింది. వీరికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.