
ఉన్నత లక్ష్యంతో చదవాలి
యాచారం: విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించడం కోసం కష్టపడి చదువుకోవాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా శుక్రవారం యాచారం ఉన్నత పాఠశాల ఆవరణను శుభ్రం చేసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, నాణ్యతలో రాజీపడొద్దని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాధారాణితో సమావేశమై రికార్డులు పరిశీలించారు. అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో యాచారం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నర్సింహ, పంచాయతీ కార్యదర్శి తిరుపతయ్య పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో
భాగస్వాములు కావాలి
మంచాల: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని మంచాల, జాపాల, రంగాపూర్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. జాపాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలశంకర్, ఎంపీఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని లింగంపల్లి గేట్ వద్ద ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని సీపీఎం నాయకులు జెడ్పీ సీఈఓకు వినతిపత్రం అందజేశారు.