
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
షాద్‌నగర్‌రూరల్: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి రైల్వేగేట్, చటాన్‌పల్లి ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ చేట్టారు. కిరాణా దుకాణాలు, బెల్టుషాపులు, దాబాలు, లాడ్జీలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిషేధిత గుట్కాలు, అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తప్పవని అన్నారు. లాడ్జీల యజమానులు అన్ని అనుమతులు తీసుకోవాలని, లాడ్జీలకు వచ్చే వారి పూర్తి సమాచారం సేకరించాలని, ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాత్రి సమయాల్లో అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని, అలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దాబాల్లో అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు చేయొద్దన్నారు. బెల్టు షాపుల్లో మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనిఖీల్లో పట్టణ సీఐ విజయ్‌కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ నర్సయ్య, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.