
పాఠశాలకు నిధులు మంజూరు చేయండి
యాచారం: కలెక్టర్ నారాయణరెడ్డికి రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి ఫోన్ చేశారు. యాచారం ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం కోదండరెడ్డిని కలిశారు. పాఠశాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరయ్యేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. దీంతో వెంటనే ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి పాఠశాల ప్రహరీ నిర్మాణం, విద్యార్థుల తాగునీటి పరిష్కారం కోసం బోరుబావి తవ్వించి మోటార్ బిగించడానికి కావాల్సిన నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని సూచించారు. స్పందించిన కలెక్టర్ నిధులు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్
మాడ్గుల: మండల పరిధిలోని కలకొండ శివారు వాగు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు సీజ్ చేశారు. సీఐ వేణుగోపాల్‌రావు తెలిపిన ప్రకారం.. శుక్రవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ టిప్పర్‌లో మట్టి తరలిస్తున్నారు. గమనించిన పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీలు చేపట్టగా ఎటువంటి అనుమతి పత్రాలు లేవని చెప్పారు. దీంతో వాహన డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసి టిప్పర్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
24న బీఆర్‌ఓయూ ఎంబీఏ అడ్మిషన్స్‌కు కౌన్సెలింగ్
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీఏ (హాస్పిటల్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) కోర్సుల్లో చేరడానికి సెప్టెంబర్ 24న వర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు 2025–26 తెలంగాణ ఐసెట్ లేదా అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ టెస్ట్‌లో అర్హత సాధించాలన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు.