ఇబ్రహీంపట్నం రూరల్: బొంగ్లూర్ ఓఆర్‌ఆర్‌పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన విషయం విదితమే. ప్రమాద కారణాలపై ఆదిబట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. అర్ధరాత్రి జరిగిన ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతులు బాల్‌రాజ్, జనార్ధన్, కృష్ణ, భాస్కర్‌రావు, చందూలాల్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
లైన్ మార్చి ప్రయాణం
ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని నిర్ధాణకు వచ్చారు. పెద్దఅంబర్‌పేట్ నుంచి మొయినాబాద్ మండల పరిధిలోని ఎనికేపల్లికి వెళ్లాల్సిన మృతులు ప్రయాణించిన కారు ప్రమాదం జరిగినప్పుడు 130 కిలోమీటర్ల వేగంగా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌పై రెండో లైన్‌లో వెళ్లాలంటే 120 కిలోమీటర్ల వేగం మాత్రమే ఉండాలి. అంతకు మించి వేగం ప్రమాదానికి కారణమైంది.
ట్రక్కును గుర్తించిన పోలీసులు
ప్రమాదం జరిగినప్పుడు కారు లారీని ఢీకొట్టిందని అంచనాకు వచ్చారు. కానీ ఫలానా లారీ అని పోలీసులకు తెలియలేదు. కారు ప్రమాదం జరిగిన చోట లారీ వెనుక బంపర్ పడిపోవడంతో దాన్ని అనుసరించి పోలీసులు దర్యాప్తు చేపట్టి టోల్‌గేట్ల వద్ద సీసీ పుటేజీలు సేకరించారు. శంషాబాద్ మీదుగా షాద్‌నగర్ వైపు వెళ్తున్న భారీ టస్కర్ ప్రమాదానికి కారణమని గుర్తించారు. షాద్‌నగర్ వద్ద ఐరెన్ చిప్స్ లోడ్‌తో వెళ్తున్న టస్కర్‌ను ఆదిబట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్రక్కు బొంగ్లూర్ ఓఆర్‌ఆర్ మీదుగా 40–50 కిలోమీటర్ల వేగంతో 2వ, మూడవ లైన్ మధ్య నుంచి వెళ్లడంతో కారు ఢీకొట్టినట్లు గుర్తించారు. ట్రక్కులు, క్యాబ్‌లు మూడు, నాల్గవ లైన్లల్లో మాత్రమే వెళ్లాలి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ భయంతో దూరం వెళ్లి వాహనం నిలిపి చూసుకున్నాడని.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయినా చలించకపోవడం నేరమని భావించారు. డ్రైవర్‌పై కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు నేతృత్వంలో త్వరలోనే ట్రక్కు డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిసింది.
ఔటర్‌పై ప్రమాదంలో విచారణ వేగవంతం
రోడ్డు భద్రతా నియమాలుపాటించని లారీ డ్రైవర్
కార్లు వెళ్లే మార్గంలో టస్కర్ ప్రయాణం
వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు