
బాలికల సంరక్షణ కోసం కృషి చేద్దాం
ఇబ్రహీంపట్నం రూరల్: బాలికా శిశు సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, అప్పుడే సమాజం బాగుంటుందని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని రహదారుల వెంట శనివారం పోలీసు బృందంతో కలిసి పర్యటించారు. రోడ్డు వెంట నడుస్తున్న బాలికలను నిలిపి విద్యా బాగోగులు, రక్షణపై ఆరా తీశారు. అనంతరం ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో తనిఖీ చేశారు. విద్యార్థులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బస్టాండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోకిరీల బెడద లేకుండా నిరంతరం వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, బాలికలను వేధింపులకు గురి చేస్తే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు మహేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మధు, నందీశ్వర్‌రెడ్డి, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి