
కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం
షాద్‌నగర్ రూరల్: వ్యక్తిగత కక్షల నేప థ్యంలో ఓ కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిల్కమర్రిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రవీందర్‌రెడ్డి షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగకు హాజరయ్యాడు. ఉత్సవాల్లో పాల్గొన్న అతనిపై ద్యాప శివకృష్ణారెడ్డి అలియాస్ కోటి హఠాత్తుగా దాడికి పాల్పడ్డాడు. బ్లేడుతో గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడిన రవీందర్‌రెడ్డిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన సత్యంరెడ్డి అనే మరో వ్యక్తికి సైతం గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.