
‘డబుల్’ ఇళ్లకు వసతులు కల్పించండి
ఇబ్రహీంపట్నం: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య డిమాండ్ చేశారు. గురువారం డబుల్ బెడ్రూం లబ్ధిదారులతో కలిసి ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డీటీ యశ్వంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. మంచాల మండలంలోని లింగంపల్లి గేట్ వద్ద నిర్మించిన 96 డబుల్ బెడ్రూం ఇళ్లను మంచాల, నోముల, లింగంపల్లి గ్రామాల పేదలకు తహసీల్దార్ సమక్షంలో లాటరీ పద్ధతిలో గత ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. అప్పట్లో లబ్ధిదారులను గృహ ప్రవేశం చేయించలేకపోయారన్నారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తమకు కేటాయించిన ఇళ్లలోకి వెళుతామని పలుమార్లు లబ్ధిదారులు వినతిపత్రాలు అందజేసినా 18 నెలలుగా స్పందన లేదన్నారు. దీంతో లబ్ధిదారులే గృహ ప్రవేశం చేశారన్నారు. కానీ అక్కడ తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు. వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించకుంటే లబ్ధిదారుల కుటుంబసభ్యులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్, కృష్ణ, యాదయ్య, జంగయ్య, గోపాల్, జంగమ్మ, బాలరాజు, సరిత, స్వాతి, భాను, మౌనిక, సంతోష లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య