
ప్రాణం తీసిన చేపల వేట
కడ్తాల్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతిచెందిన ఘటన మండల కేంద్రం సమీపంలోని కానుగుల కుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కందుకూరు మండలం ఉట్లపల్లికి చెందిన దొంతుల అంజయ్య(45) మేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన రాజు, కృష్ణయ్య, శ్రీనుతో కలిసి, చేపలు పట్టేందుకు కానుగుల కుంటకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన అంజయ్య ప్రమాదవశాత్తు నీట మునిగి, బయటికి రాలేకపోయాడు. మిగిలిన వాళ్లు వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితులతో పాటు కడ్తాల్ పోలీసులు సంఘట న స్థలానికి చేరుకుని, బుధవారం అర్ధరాత్రి వరకు చెరువులో గాలించినా ఆ చూకీ లభించలేదు. గురువారం ఉదయం స్థానిక ఎస్‌ఐ వరప్రసాద్, పోలీసు సిబ్బంది, మహేశ్వరానికి చెందిన ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు కుంటలో గాలించి ఊబిలో కూరుకుపోయిన మృతదేహన్ని బయటకు తీశారు. అనంత రం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శామంతతో పాటు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు. అంజయ్య మృతి తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుంటలో మునిగి వ్యక్తి మృతి
ఉట్లపల్లిలో విషాదం