
ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలి
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ కోరారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించారు. అనంతరం సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. పాఠశాలల్లో అవసరమైన వసతులు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బాలుర ఉన్నత పాఠశాలలో పీఈటీ పోస్టును భర్తీ చేయాలని, విద్యార్థుల లైబ్రరీ సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, రామ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కిరోసిన్ డబ్బాలతో హల్‌చల్
న్యాయం చేయాలని రైతుల ప్రదర్శన
నందిగామ: తమ భూములు కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకొని పత్తాలేకుండా పోవడమే కాకుండా, మమ్మల్ని సదరు భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్న రియల్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని అప్పారెడ్డిగూడ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కిరోసిన్ డబ్బాలతో తమ పొలాల వద్ద బుధవారం నిరసనకు దిగారు. అందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని వీర్లపల్లి రెవెన్యూ శివారు అప్పారెడ్డిగూడలో 370 నుంచి 377 వరకు గల సర్వే నంబర్లలో ముగ్గురు రైతుల నుంచి సుమారు 11 ఎకరాలను హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తామని, కొంత డబ్బులు చెల్లించి 2024 జూలైలో ఒప్పందం చేసుకున్నారు. గడువు తీరినా మిగతా డబ్బులు చెల్లించకపోవడమే కాకుండా సదరు భూమిలోకి పోలీసులను పంపించి తమని రానివ్వకపోడం ఏమిటని రైతులు రామయ్య, చెన్నయ్య, అనుసూజ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందం మేరకు తమకు డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే తాము తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించి ఒప్పందం రద్దు చేసుకుంటామని చెప్పారు.
పశువులు తరలిస్తున్న
కంటైనర్ సీజ్
● గోశాలకు మూగజీవాల తరలింపు
● కేసు నమోదు చేసి పోలీసులు
కడ్తాల్: అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ నుంచి ఓ కంటైనర్‌లో అనుమతి లేకుండా హైదరాబాద్‌కు పశువులు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు కడ్తాల్ సమీపంలో వాహనాన్ని తనిఖీ చేశారు. కంటైనర్‌లో 64 ఆవులు, 41 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. ఇరుకు స్థలంలో ఊపిరాడక 4ఆవులు మృతిచెందాయన్నారు. పశువులను జియాగూడ కామధేను సమర్థ గోశాలకు తరలించారు. వాహనాన్ని సీజ్ చేసి, యజమాని ఎండీ తలీమ్‌తో పాటు డ్రైవర్, మరో ముగ్గురు కార్మికులపై కేసు నమోదు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు.
కొటారి నిర్మలకు డాక్టరేట్
ఇబ్రహీంపట్నం: కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో చేసిన పరిశోధనలకుగాను కొటారి నిర్మలకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించింది. ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఉషారాణి పర్యవేక్షణలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నిర్మల చేసిన పరిశోధనలపై సంతృప్తి వ్యక్తంచేసిన యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా అందజేసింది. ప్రస్తుతం ఆమె ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులను నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలి

ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలి