
బోధనేతర పనులు అప్పగించొద్దు
మంచాల: ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించడం తగ్గించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్టపాక ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని నోముల, లింగంపల్లి, మంచాల, తాళ్లపల్లిగూడ, తిప్పాయిగూడ, జాపాల, ఆరుట్ల పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు ఉపాధ్యాయులను చరవాణి ఉపయోగించ రాదని చెప్పి మరోవైపు ఫోన్‌లో అన్ని వివరాలు నమోదు చేయాలని ఆదేశించడం ఎంతవరకు సమాంజసమన్నారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, పరీక్ష ఫలితాలు తదితర వివరాలను ఫోన్‌లో నమోదు చేయాలన్నారు. కానీ సమయానికి యాప్‌లు సరిగ్గా పని చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఆరు నెలలుగా వేతనాలు అందలేదన్నారు. వెంటనే వారికి జీతాలు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాండురంగారెడ్డి, నాయకులు సుధాకర్, జయానంద్, శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్