
కంపెనీ వాహనం ఢీకొని సెక్యూరిటీ గార్డ్ మృతి
పహాడీషరీఫ్: తాను పనిచేస్తున్న కంపెనీ వాహనం ఢీకొని ఓ సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశా రాష్ట్రానికి చెందిన సదానంద్ బెహరా కుమారుడు వికాస్ బెహరా(25) బతుకుదెరువు నిమిత్తం వలసవచ్చి పహాడీషరీఫ్ రంగ నాయకుల కాలనీలో నివాసం ఉంటున్నాడు. మామిడిపల్లి శివారులోని రాక్‌స్టోన్ క్రషర్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు కంపెనీకి చెందిన లారీ ర్యాష్‌గా రివర్స్ తీసుకుంటూ వికాస్ పైనుంచి పోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కార్మికుల భద్రత పట్టదా..?
మామిడిపల్లిలోని రాక్‌స్టోన్ క్రషర్ పరిశ్రమ నిర్వాహకులు కార్మికుల భద్రతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.దత్తు నాయక్ ఆరోపించారు. సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. మామిడిపల్లి మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్ కూడా అక్కడికి చేరుకొని కంపెనీ యజమాన్యంతో చర్చించారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయానికి అంగీకరించడంతో ఆందోళన విరమించారు.