
1,572 మందికి ఫార్మా ప్లాట్లు
● మొదటి విడతలో గైర్హాజరైన లబ్ధిదారులకు కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ● రెండో విడతలో ఐదు నుంచి 18 ఎకరాలు కోల్పోయిన రైతులకు
కందుకూరు: ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో ఇటీవల మొదటి విడత ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. కాగా ఆయా తేదీల్లో హాజరు కాని లబ్ధిదారులకు ప్రస్తుతం కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ పరిధిలో 4,170 మందికి అధికారులు లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేపట్టగా, అందులో 2,062 మంది రిజిస్ట్రేషన్ కోసం సంతకాలు చేశారు. 1,572 మంది గైర్హాజరు కాగా ప్రస్తుతం వారికి ఆయా ఆర్డీఓల పరిధిలో రిజిస్ట్రేషన్ కోసం వివరాలు సేకరిస్తున్నారు. మొదటి విడతలో కందుకూరు పరిధిలో 1,433 మంది లబ్ధిదారులకు గాను 1,234 మందికి 60 గజాల నుంచి 544(నాలుగున్నర ఎకరాలు)గజాల ప్లాట్లు కేటాయించారు. ఐదెకరాల నుంచి 18 ఎకరాల వరకు ఉన్న దాదాపుగా 200 మంది లబ్ధిదారులకు రెండో విడతలో ప్లాట్లను కేటాయించనున్నారు. ప్రస్తుతం వారికి ప్లాట్లు కేటాయించడానికి అధికారులు పనులు చేపట్టారు. కాగా లాటరీలో ప్లాట్లు పొందిన వారి నుంచి కొంత మంది పేర్లతో శాంపిల్‌గా సబ్‌రిజిస్ట్రార్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఎలాంటి సమస్యలు లేని వారి పేర్లతో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడానికి దాదాపు నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.