
పదవుల పండుగ
● ఎమ్మెల్యే ఎంపిక చేసిన వారే కాంగ్రెస్ మండల అధ్యక్షులు ● ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీగా ఆశావహులు ● స్థానిక ఎన్నికల్లో ‘హస్త’గతమే లక్ష్యంగా నియామకం
యాచారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులుగా గెలిచేలా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగా రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో పార్టీ మండలాధ్యక్షుల నియామకానికి సమాలోచనలు చేస్తున్నారు. తన అనుచరులతో కలిసి ఏ వ్యక్తిని మండల అధ్యక్షుడిని చేస్తే పార్టీకి మేలు జరుగుతుందనే విషయమై చర్చలు సాగిస్తున్నారు. కొంతమంది ఫలానా వ్యక్తిని నియమిస్తే పార్టీకి మేలు చేకూరుతుందని.. సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే సత్తా ఉందని చెబుతుండగా.. మరికొందరు ఫలానా నేతను వద్దంటూ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో అంగ, ఆర్థిక బలమున్న నాయకులకే బాధ్యతలు అప్పగిస్తే మేలు జరుగుతుందని ఎమ్మెల్యే నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కుల సమీకరణలు
కాంగ్రెస్ సర్కార్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే కసరత్తు చేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అత్యధికంగా కాంగ్రెస్ బలపర్చిన నేతలే సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో అన్ని మండలాల్లో కాంగ్రెస్ జెండానే ఎగురవేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే ఆయా మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఎమ్మెల్యే ఆశీస్సులుంటేనే..
ఇప్పటికే కొందరు ఆశావహులు మండల అధ్యక్షులుగా తమ పేర్లే ప్రకటించేలా చూడాలని టీపీ సీసీ పెద్దలు, మంత్రుల నుంచి ఎమ్మెల్యేకు ఫోన్లు చేయిస్తున్నారు. ఇందుకు సమాధానంగా నియో జకవర్గంలో ఎవరిని అధ్యక్షుడిని చేస్తే పార్టీకి మేలు జరుగుతుందో తనకు తెలుసంటూ సున్నతంగా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. మండల అధ్యక్షుల నియామకంలో ఆయన ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఎన్ని కల పరిశీలకులు సైతం తాను పంపిన పేర్లే ఫైన ల్ చేయాలని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆశీస్సులున్న వారే పార్టీ మండల, మున్సిపల్ అధ్యక్షులుగా ఎంపికయ్యే అవకాశం ఉంది.