
విన్నపాలు.. బుట్టదాఖలు
‘ప్రజావాణి’కి జనాల బారులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ జిల్లాలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించడం.. ఆన్‌లైన్‌లో నమోదు చేయడం మినహా శాశ్వత పరిష్కార మార్గం చూపడం లేదనే అపవాదు లేకపోలేదు. కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి మోకాళ్లు అరుగుతున్నాయే కానీ.. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ పదేపదే చెబుతున్నా.. ఆయా శాఖల అధికారులు మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఫలితంగా అనేక వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కలెక్టరేట్‌కు చేరుకుంటున్న బాధితులు ఉసూరుమంటున్నారు. సాధారణంగా ప్రతి వారం 60 నుంచి 70 దరఖాస్తులు వస్తుండగా, తాజాగా ఈ వారం 152 అర్జీలు అందడం గమనార్హం. వీటిలో భూ సంబంధిత ఫిర్యాదులు 130 వరకు ఉండగా, ఇతర శాఖలకు సంబంధించినవి 22 వరకు ఉన్నాయి.
వారం వారం అర్జీల వెల్లువ
అపరిష్కృతంగానే సమస్యలు
కలెక్టర్ ఆదేశించినాపట్టని క్షేత్రస్థాయి అధికారులు
ప్రదక్షిణలు చేస్తున్న బాధితులు
ఎనిమిదేళ్లుగా తిరుగుతున్నా
ఇబ్రహీంపట్నం మండ లం నెర్రపల్లిలోని సర్వే నంబర్ 262లో 6.20 ఎకరాల పట్టా భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో భూదాన్ భూమిగా రికార్డైంది. ప్రస్తుతం నా వయసు 70 ఏళ్లు. ఎటూ నడవలేకపోతు న్నా. రికార్డుల్లో దొర్లిన తప్పును సరి చేయా లని ఎనిమిదేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. తిరిగి తిరిగి నా మోకాళ్లు అరిగిపోయాయే కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.
– గుడ్ల సాయిలు యాదవ్, నెర్రపల్లి
20 సార్లు ఫిర్యాదు చేశా
తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి సర్వే నంబర్ 550, 542లలో 9.4 ఎకరాల పట్టా భూమి ఉంది. నా భూమికి ఆనుకుని సర్వే నంబర్ 550లో సీలింగ్ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సీలింగ్ భూమిని పట్టా భూమిగా మార్చి.. పట్టా భూమిని సీలింగ్ భూమిగా మార్చారు. నాకు రెండు కాళ్లు పని చేయడం లేదు. వీల్‌చైర్‌లో కలెక్టరేట్‌కు రావాల్సి వస్తోంది. ఇప్పటికే 20 సార్లు వచ్చి పోయాను.
– గోవింద కృష్ణయ్య, గట్టుప్పలపల్లి

విన్నపాలు.. బుట్టదాఖలు

విన్నపాలు.. బుట్టదాఖలు