
హెచ్‌ఎంను తొలగించాలని ధర్నా
● పాఠశాలకు చేరుకుని ఆరా తీసిన డీఈఓ ● ప్రధానోపాధ్యాయుడిని బదిలీ చేస్తున్నట్లు వెల్లడి
షాబాద్: విద్యార్థులతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బూతు మాటలతో ఇబ్బంది పెడుతున్న షాబాద్ బాలుర పాఠశాల హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమ వారం ఉదయం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు. తమ పిల్లలను బూతు మాటలు తిడుతూ, కాళ్లతో తన్నిన హెచ్‌ఎం గోవింద్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని బైఠాయించారు. వీరికి పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత, పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ మద్దతు తెలిపారు. కలెక్టర్, డీఈఓ వచ్చేదాకా కదిలేది లేదని తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశమై హెచ్‌ఎంపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. కలెక్టర్ ఆదేశానుసారం పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. హెచ్‌ఎం గోవింద్‌ను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ ఆయనపై ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని, వాటిపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. తర్వాత సుశీందర్‌రావు షాబాద్ కేజీబీవీ పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.