
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి
● ప్రభుత్వ భూములను కాపాడండి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఇబ్రహీంపట్నం రూరల్: అన్యాక్రాంతమైపోతున్న ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమ వారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాన్‌వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను వెలికి తీయాలన్నారు. పేదలు ఇళ్లు లేక, జాగలు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింహారావు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామేలు, చంద్రమోహన్, డి.జగదీష్, కందుకూరి జగన్ పాల్గొన్నారు.