
మొగిలిగిద్ద కళాశాలను అభివృద్ధి చేయండి
షాద్‌నగర్: ఇంటర్మీడియెట్ విద్యామండలి కమిషనర్ కృష్ణ ఆదిత్యను సోమవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామస్తులు కలిశారు. ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన శ్యాంసుందర్, మల్లేష్ కమిషనర్‌ను కలిసి మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రామంలో పర్యటించినప్పుడు కళాశాల అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు. సివిక్స్ పోస్టు ఖాళీగా ఉందని గెస్టు లెక్చరర్‌ను నియమించాలని, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, టెలివిజన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.