
బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం
మహేశ్వరం: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. పట్టా పాసు బుక్ కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.6 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం, రూ. 2లక్షలలోపు రైతు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు రూ.500 గ్యాస్ సబ్సిడీ, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదలు ఒక్కరికై నా డబుల్ బెడ్రూం నిర్మాణం చేసి ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హ యాంలోనే ఇందిరాగాంధీ పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, ఇళ్ల స్థలాల పంపిణీ చేశారని, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి పేదల సంక్షేమమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు చెప్పారు. బీఆర్‌ఎస్ బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.