
అంతా కల‘రింగ్’
ౖపైపె పూతలతో రంగులు
● పటిష్టత లేని హంగులు
● ఫ్లై ఓవర్లకు ఇవేం పనులు?
● వృథా అవుతున్న రూ.కోట్లు
● ఇవి ఎవరి ప్రయోజనాల కోసమో..
● కాంట్రాక్టర్ల జేబులు నింపడానికో..
సాక్షి, సిటీబ్యూరో: తెలుగుతల్లి.. నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లకు రంగులేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. వాటి పటిష్టత ఎంత? అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి. ప్రపంచ సుందరి పోటీలు అనో, ఇంకో సందర్భమనో, ఏవీ కాకున్నా నగరం అందంగా కనపడాలనో పలు ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లకు రంగులేశారు. రూ.కోట్లు ఖర్చు చేశారు. ఆ చేసే పనేదో వాటికి పటిష్టత పరీక్షలు నిర్వహించి, అవసరమైన మరమ్మతులు చేశాక రంగులేస్తే ప్రయోజనం ఉండేది. కానీ.. ఎవరి ప్రయోజనాలకో, కాంట్రాక్టర్లకు జేబులు నింపడానికో ఇలాంటి పనులు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంటికై నా మరో నిర్మాణానికై నా రంగులేశాక మరమ్మతులు చేస్తారా? మరమ్మతులు చేశాక రంగులేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫ్లై ఓవర్లకు పెద్దగా మరమ్మతులంటూ అవసరం ఉండదు.. కానీ నిర్ణీత వ్యవధుల్లో నిర్మాణ పటిష్టత (స్ట్రక్చరల్ స్టెబిలిటీ) పరీక్షలు అవసరమంటున్నారు నిపుణులు. నగరంలోని కొత్త ఫ్లై ఓవర్లు మినహాయిస్తే పాత ఫ్లై ఓవర్లకు అవి తప్పనిసరి అని పేర్కొన్నారు. నగరంలో దశాబ్దం, రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఫ్లై ఓవర్లు 30కి పైగా ఉన్నాయి. బేగంపేట, సీటీఓ జంక్షన్, హరిహర కళాభవన్, తార్నాక, బషీర్‌బాగ్, మాసబ్‌ట్యాంక్, తెలుగుతల్లి తదితర ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లు నిర్మించి రెండు దశాబ్దాలు దాటింది. వీటన్నింటికీ స్టెబిలిటీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మరమ్మతులు చేయాల్సి ఉంది. ఆ పని చేయకుండా ఫ్లైఓవర్లపై పడే గుంతలు పూడ్చేందుకు ౖపైపె కోటింగ్‌లు వేస్తూ పోతుండటంతో కొన్ని ఫ్లై ఓవర్ల మందం పెరిగిపోయింది.
పటిష్ట చర్యలు అవసరం
దీర్ఘకాలంలో ఫ్లై ఓవర్లకు సంబంధించిన బేరింగులు, ఎక్స్‌పాన్షన్ జాయింట్స్ వదులవుతాయని వాటిని పటిష్ట పరిచేందుకు మరమ్మతులు అవసరమని ఇంజినీరింగ్ నిపుణులు తెలిపారు. నగరంలోని పాత ఫ్లై ఓవర్లలో రెండు మూడు ఫ్లై ఓవర్లకు తప్ప మిగతా వాటికి మరమ్మతులు జరగలేదని సమాచారం. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌కు దాదాపు ఐదేళ్ల క్రితం స్వల్ప మరమ్మతులు మాత్రం చేశారు. పూర్తిస్థాయి మరమ్మతులు చేయకుండానే ప్రస్తుతం రంగుల హంగులు, పచ్చదనం పెంపు వంటి చర్యలకు సిద్ధమయ్యారు.
నిర్ణీత వ్యవధుల్లో మరమ్మతులు అవసరం..
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, సాధారణంగా ఫ్లైఓవర్లలోని గర్డర్స్ ప్రాంతాల్లో కాంక్రీట్ దెబ్బతింటుంది. బేరింగులు అరిగిపోతాయి. ఎక్స్‌పాన్షన్ జాయింట్స్ వదులై బలహీనంగా మారతాయి. స్తంభాల పైభాగాలు (పయర్ క్యాప్స్) తుప్పుపడతాయి. బాక్స్‌గర్డర్స్ ఏటవాలు గోడల్లో పగుళ్లు ఏర్పడతాయి. నిర్ణీత వ్యవధుల్లో వాటికి మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ అలా జరగడం లేదు. ఒక్కో ఫ్లైఓవర్‌కు దాదాపు 15–20 స్పాన్‌లుంటాయి. వాటిల్లో ఉండే బేరింగ్‌లను జాకీలు ఏర్పాటుచేసి మార్చాల్సి ఉంటుంది. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ కొత్తలోనే జరిగిన ప్రమాదంతో కొత్తవి, పాతవి అన్నింటికీ అదనపు సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని, వేగ పరిమితి హెచ్చరికలతోపాటు క్రాష్‌బారియర్స్, వ్యూకట్టర్స్ తదితర ఏర్పాట్లు చేయాలని భావించారు. కానీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. అధికారుల వద్ద ఈ అంశాలు ప్రస్తావించగా, త్వరలో తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
థర్డ్ పార్టీతో పరీక్షలు
నగరంలోని పాత ఫ్లై ఓవర్ల పటిష్టతను నిర్దారించేందుకు థర్డ్‌పార్టీ నిపుణుల కమిటీని నియమించి, పరీక్షలు చేయించి అదిచ్చేనివేదిక మేరకు, కమిషనర్ సూచనలకు అనుగుణంగా స్పెషలైజ్డ్ మెయింటనెన్స్ ఆపరేషన్స్, రిట్రో ఫిట్టింగ్, రిస్టోరేషన్ పనులు జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాట్‌హోల్స్ పూడ్చివేత, స్వల్ప పగుళ్ల ప్యాచ్‌వర్క్స్, దెబ్బతిన్న రెయిలింగ్స్‌కు మరమ్మతులతోపాటు అవసరమైన ప్రాంతాల్లో యాంటి కార్బొనేషన్ పూతలు వేసే పనులు నిర్వహణ విభాగం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.