
వ్యక్తి బలవన్మరణం
పహాడీషరీఫ్: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపిన ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంబికా, సుధాకర్(45) దంపతులు 17 ఏళ్ల క్రితం జల్‌పల్లి శ్రీరామ కాలనీకి బతుకుదెరువు నిమిత్తం వలస వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. తాగుడుకు బానిసైన సుధాకర్ మూడు నెలలుగా భార్యను వేధిస్తుండడంతో ఆమె పిల్లలతో కలిసి స్థానికంగా ఉండే తన తల్లిగారింటికి వెళ్లింది. ఐదు రోజులుగా పనికి రాకపోవడంతో శనివారం ఉదయం తెలుసుకుందామని తోటి కార్మికుడు దేవిదాస్ చూసేందుకు వెళ్లడంతో సుధాకర్ ఇంట్లోని కిటికి గ్రిల్స్‌కు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే అతడు సుధాకర్ భార్యకు సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. సుధాకర్ శుక్రవారం రాత్రి కూడా బాగా తాగి కనిపించాడని, తాగుడుకు బానిసై మానసికంగా స్థితి సరిగ్గా లేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
రాజేంద్రనగర్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన సునీల్ (19) పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. శనివారం ఉదయం తల్లి చదువుకోవాలని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన సునీల్ ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అనుమానంతో కుటుంబ సభ్యులు డోర్ తెరిచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పిచ్చికుక్క స్వైర విహారం
● పశువుల మందపై దాడి
● ఆవు మృత్యువాత
ధారూరు: పశువుల మందపై పిచ్చికుక్క దాడి చేయడంతో ఓ ఆవు మృత్యువాత పడింది. ఈ ఘటన శనివారం మండల పరిధిలోని నాగసమందర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మాజీ వైస్ ఎంపీపీ వరద మల్లికార్జున్‌కు చెందిన పశువులపాకలోకి ఓ పిచ్చి కుక్క వెళ్లి ఆవును కరవడంతో అది అక్కడికక్కడే మృత్యువాత పడింది. గ్రామంలో ఎక్కడ పశువులు కనిపించినా కుక్క వెంబడించింది. గమనించిన గ్రామస్తులు పట్టుకునేందుకు యత్నించినా దొరకలేదు.
నాగారంలో చిన్నారిపై దాడి
మండల పరిధిలోని నాగారంలో చాకలి కృష్ణయ్య కూతురుపై శుక్రవారం రాత్రి ఓ కుక్కదాడి చేసి గాయపరిచింది. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాల్లో వీధి శునకాలను తరలించేందుకు అధికారులు చొర తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.