
పసికందును పారేశారు!
ఉప్పల్: ఆ కన్నతల్లికి పేగు బంధమే భారం అయిందా? శిశువును వదిలించుకోవాలని ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే రీతిలో అమానవీయ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన.. ఇంకా కళ్లు కూడా సరిగా తెరవని పసికందును రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేన్ పరిధిలోని రామంతాపూర్ వివేక్‌నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున మగశిశువు ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో కౌశిక్ అనే వ్యక్తి ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌లో శిశువును నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి కంటికి గాయం కావడంతో కమిలిపోయి ఉంది. ఆస్పత్రిలో చిన్నారిని వైద్యులు పరీక్షించారు. శిశువుకు ఎలాంటి అపాయం లేదని వారు వెల్లడించినట్లు సమాచారం. కన్నతల్లే కావాలని శిశువును ఇలా రోడ్డుపై వదిలి వెళ్లిందా? లేక ఎవరైనా వేరే ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ పారవేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.