
వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేసిన భార్య
మైలార్‌దేవ్‌పల్లి: నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తుండడంతో భర్తను భార్య హతమార్చిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..వట్టేపల్లి సైఫ్ కాలనీ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సైఫ్ (30), ఫరీదా సుల్తానాలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఫరీదా ప్రతిరోజు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. మద్యానికి బానిసైన మహమ్మద్ సైఫ్ ప్రతి రోజు భార్యను వేధిస్తున్నాడు. బుధవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి వేధించగా..ఫరీదా కోపంతో బండరాయితో తలపై మోదడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకుని సుల్తానాను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
● కేశంపేట పీఎస్‌లో ఫిర్యాదు ●కేసు నమోదు చేసిన పోలీసులు
కేశంపేట: కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని లేమామిడి శివారులో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండల పరిధిలోని డోకూరుకు చెందిన అర్కే శివలింగానికి కుర్మిద్దకు చెందిన దీపిక (25)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంజయ్‌కుమార్ (07), కీర్తన (05) సంతానం. శివలింగం ఉపాధి నిమిత్తం లేమామిడి శివారులోని వెంకో రీసెర్చ్ బ్రీడింగ్ ఫాంలో ఎనిమిది నెలల క్రితం పనికి కుదిరాడు. కుటుంబంతో కలిసి ఇక్కడే ఓ గదిలో జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా గత మంగళవారం ఉదయం దీపిక గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్ మాట్లాడుతున్నట్లు గుర్తించిన శివలింగం ఆమెను మందలించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన దీపిక తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్తున్నట్లు పొరుగువారికి చెప్పింది. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వచ్చిన శివలింగానికి భార్యాపిల్లలు కనిపించకపోవడంతో పొరుగువారిని ఆరా తీశాడు. దీపిక పుట్టింటికి ఫోన్ చేసి అడగగా అక్కడికి రాలేదని చెప్పారు. బంధువులతో పాటు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు.
కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం
ఇద్దరు వ్యక్తులకు రిమాండ్
హయత్‌నగర్: ఇద్దరు వ్యక్తల నుంచి కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ షాపూర్‌నగర్‌కు చెందిన అన్నపూరి వెంకటేశ్, ఇబ్రహీంపట్నం అలిమియాకుంటకు చెందిన మహ్మద్ షోయబ్ పెద్దఅంబర్‌పేట్ ప్రాంతంలో గంజాయిని క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్‌ఓటీ, హయత్‌నగర్ పోలీసులు పెద్దఅంబర్‌పేట్‌లోని కేవీకే వాటర్ వాషింగ్ సెంటర్‌పై దాడి చేసి, గంజాయిని విక్రయిస్తున్న వెంకటేశ్‌ను, కొనేందుకు వచ్చిన మహ్మద్ వాజిద్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని విక్రయించేందుకు వచ్చిన మహ్మద్ షోయబ్, కొనేందుకు వచ్చిన మహ్మద్ మస్తాన్‌వలి తప్పించుకున్నారు. వెంకటేశ్‌పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి కిలోన్నర ఎండు గంజాయి, బైకు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
బదిలీల తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలి
ఆమనగల్లు: ఉపాధ్యాయుల బదిలీ తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలని గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరిధర్‌గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం నగరంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయుల బదిలీల తర్వాత ప్రమోషన్లు ఇస్తేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.

వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేసిన భార్య

వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేసిన భార్య