
రైతులకు పట్టాలివ్వండి
మంచాల: రాచకొండ రెవెన్యూ పరిధిలో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాదగోని జంగయ్యగౌడ్, మేఘావత్ లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సంస్థాన్ నారాయణపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాచకొండ రెవెన్యూ పరిధిలోని 273 సర్వే నంబర్‌లోని వందలాది ఎకరాల భూములను మంచాల మండలం పటేల్‌చెరువు తండాకు చెందిన గిరిజనులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి చట్టాన్ని తీసుకురావడంతో వీరికి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదన్నారు. గతంలోని పాత పట్టా పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు కూడా పొందారని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీరికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో బాధిత రైతులకు న్యా యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కావలి బుగ్గరాములు, రైతులు రవినాయక్, జూలనాయక్, నరేందర్‌నాయ క్, మోతీరాంనాయక్, శ్రీధర్‌నాయక్ పాల్గొన్నారు.