
విద్యుదాఘాతంతో గేదెల మృతి
మొయినాబాద్: విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్‌నగర్‌కు చెందిన గుంటి పోచయ్య గేదెల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వాటిని మేత మేయడానికి వదిలాడు. హిమాయత్‌నగర్ రెవెన్యూలో తెగి పడిన విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో కరెంటు షాక్‌తో రెండు గేదెలు మృతి చెందాయి. రాత్రయినా గేదెలు రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. గురువారం ఉదయం గేదెల కళేబరాలు కనిపించాయి. బాధితుడు మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని.. నష్టపోయిన తమను ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరాడు.
సకాలంలో రక్తం అందక బాలింత మృతి
మలక్‌పేట: సకాలంలో రక్తం అందక బాలింత మృతి చెందిన సంఘటన మలక్‌పేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..అక్బర్‌బాగ్‌కు చెందిన సురేష్ భార్య నెమలిక(21) ప్రసవం నిమిత్తం మంగళవారం మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో చేరింది. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు తీవ్రరక్త స్రావం కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో, ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ లేనందున ఆమెను కోఠి మెటర్నిటీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సకాలంలో వైద్యం అందనందునే నెమలిక మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు గురువారం ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. వందల కాన్పులు జరిగే ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నా రు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.