ఆగని ఆక్రమణలు
● కబ్జాకు గురవుతున్నగంగరాయన్ చెరువు ● ఎఫ్‌టీఎల్‌లో యథేచ్ఛగా మట్టి డంపింగ్ ● గొలుసుకట్టు కాలువలు ధ్వంసం
తుర్కయంజాల్: చెరువులు, కుంటలు, కాల్వల పరిరక్షణకు ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నా ఆక్రమణలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా వీటిని అన్యాక్రాంతం చేసేందుకు అక్రమార్కులు సిద్ధంగా ఉన్నారు. తుర్కయంజాల్ పురపాలక సంఘం పరిధి రాగన్నగూడ గంగరాయన్ చెరువులో స్థానికంగా నివాసం ఉండే కొంతమంది వ్యక్తులు టిప్పర్ల ద్వారా మట్టిని తెచ్చి డంప్ చేస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు దినాలను ఎంచుకుని ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఎప్‌టీఎల్, బఫర్ జోన్లను దాటి మట్టి డంప్ చేయడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్‌ఓసీల పేరుతో..
తుర్కయంజాల్ రెవెన్యూ సర్వే నంబర్ 314, మన్నెగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 7, 8, 9, 10, 11, 56లో గంగరాయన్ చెరువు విస్తరించి ఉంది. సర్వే నంబర్ 7, 8, 9, 10లోని 3.5 ఎకరాల పొలానికి ఎన్‌ఓసీ తెచ్చుకున్నామని చెబుతూ కొంతమంది మట్టి డంప్ చేస్తున్నారు. 2023లో దరఖాస్తు చేసుకోగా ఇటీవల దీనికి ఎన్‌ఓసీని జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 2020 అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షానికి ఈ చెరువు మొత్తం నిండి, చుట్టు పక్కల ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. అప్పట్లో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు చెరువును పరిశీలించారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్‌ఓసీ జారీ చేయడం స్థానికంగా విమర్శలకు దారితీసింది.
నీరు పారేదెలా..?
ఎర్రకుంట చెరువు నిండితే గొలుసుకట్టులో భాగంగా కింద ఉన్న గంగరాయన్ చెరువులోకి నీళ్లు వస్తాయి. కానీ సంబంధించిన కాల్వలను అక్రమార్కులు పూడ్చేశారు. ఇప్పటికే ఎర్రకుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అనేక నిర్మాణాలు వెలిశాయి. వీటి చుట్టూ ప్రహరీలు కట్టడంతో చిన్నపాటి వర్షానికే నీళ్లు ముంచెత్తుతున్నాయి. ఈ చెరువును అన్యాక్రాంతం చేయడానికి 2016లో నకిలీ ఎన్‌ఓసీని తెచ్చిన కొంతమంది మట్టిని నింపే ప్రయత్నం చేశారు. దీనికి తోడు ఇరిగేషన్, రెవె న్యూ, మున్సిపల్ శాఖల అధికారులు ఇష్టానుసారంగా అనుమతులను మంజూరు చేయడంతో భారీ భవంతులు వెలిశాయి. భవిష్యత్తులో గంగరాయన్ చెరువు పరిస్థితి కూడా ఇలాగే మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నిర్మాణ వ్యర్థ్యాల పారబోత..
గంగరాయన్ చెరువులో ఒక వైపు మట్టిని డంప్ చేస్తుండగా ఎఫ్‌టీఎల్ పరిధిలో పెద్దఎత్తున నిర్మాణ వ్యర్థాలను తెచ్చి పారబోస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్రమార్కులు చెరువు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో వెంచర్లు ఏర్పాటు చేయగా, అనేక మంది అమాయకులు ఇందులో ప్లాట్లు కొనుగోలు చేశారు. కొంత మంది ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, చెరువు భూమిని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
మట్టిని తొలగిస్తాం..
చెరువులో మట్టి డంప్ చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వెళ్లి పరిశీలించామని ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ తెలిపారు. చెరువు స్థలాన్ని కబ్జా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో డంప్ చేసిన మట్టిని తొలగిస్తామన్నారు.
ఆగని ఆక్రమణలు


