తెలంగాణ తేజం ‘మర్రి’ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ తేజం ‘మర్రి’

Published Thu, Nov 9 2023 7:14 AM | Last Updated on Thu, Nov 9 2023 7:14 AM

సిరిపురంలో చెన్నారెడ్డి స్వగృహం  
 - Sakshi

ఐదు దశాబ్దాల రాజకీయంలో తనదైన ముద్ర
తెలుగు ముఖ్యమంత్రుల్లో మర్రి చెన్నారెడ్డి ప్రత్యేకత చాటాడు. 1978లో దేశమంతా కాంగ్రెస్‌ వ్యతిరేకత, 1989లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయన సొంతం. ట్రబుల్‌ మేకర్‌ అండ్‌ షూటర్‌గా పేరున్నట్టే పదవులు వివాదాలు వెన్నంటే ఉందేవి.
● ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చెన్నారెడ్డి ● నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలు ● 1969లో టీపీఎస్‌ ఏర్పాటు ● అనంతరం కాంగ్రెస్‌లో విలీనం

వికారాబాద్‌: మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన మర్రి చెన్నారెడ్డి ఐదు దశాబ్దాల రాజకీయ దురంధురుడు. 1919 జనవరి 13న మర్రి లక్ష్మారెడ్డి, శంకరమ్మలకు జన్మించిన ఆయన అంచలంచెలుగా కీర్తి గడించారు. ప్రజల నాడీ తెలిసిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన ట్రబుల్‌ మేకర్‌ మ్రాతమే కాకుండా ట్రబుల్‌ షూటర్‌గానూ పేరు గడించారు. 1969లో తెలంగాణ ప్రజా సమితి పార్టీని స్థాపించి తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజాల్లోకి తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా, దేశంలోని నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు.

విద్యాభ్యాసం

స్వగ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి విద్యావసతులు సరిగా లేక రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండల పరిధిలోని పెద్దమంగళారంలోని మేనమామ కొండా వెంకట రంగారెడ్డి వద్ద ఉన్నత విద్యభ్యాసం పూర్తి చేసుకున్నారు. వికారాబాద్‌లో ఇంటర్‌ విద్య తర్వాత ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్‌గా వైద్య సేవలందించారు. ఉద్యోగ రీత్యా నాగార్జున సాగర్‌కు బదిలీ అయింది. దీంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పాతబస్తీలోని ఫీల్‌ఖానాలో క్లినిక్‌ ఏర్పాటు చేసి ఏడాదిన్నర పాటు సేవలందించారు. అక్కడ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన మేనమామపై ఉన్న కృతజ్ఞతతో 1979లో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలను కలుపుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి పేరిట రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు.

తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర వెనుకబాటును గుర్తించిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్‌)‘ని స్థాపించారు. అప్పటి పార్లమెంటు ఎలక్షన్‌లో పార గుర్తుపై పోటీచేసి 13 పార్లమెంటు సీట్లకు గాను 11 సీట్లను కై వసం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను బలంగా చూపింది. కాగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో మళ్లీ ఆయన కాంగ్రెస్‌లో టీపీఎస్‌ను విలీనం చేశారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సమయంలో సీఎం జయలలిత పంపిన ఓ బిల్లును ఆమోదించాల్సి ఉండగా బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ తిప్పిపంపారు. జయలలిత గవర్నర్‌ చెన్నారెడ్డిని రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేసినా ఆయన మెట్టు దిగలేదు. గవర్నర్‌ గిరీకి నేను రబ్బరు స్టాంపును కాదలచుకోలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి.

వికారాబాద్‌ ప్రాంత అభివృద్ధికి..

ఈ ప్రాంతంలోని చిన్నపల్లెటూరు నుంచి సీఎం, గవర్నర్‌ లాంటి అత్యున్నత పదవులను అలంకరించిన చెన్నారెడ్డి వికారాబాద్‌ ప్రాంతానికి ఎనలేని సేవలను అందించారు. జిల్లాలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు ‘కోట్‌పల్లి’నిర్మణం ఆయన చలువే. దీంతో తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్‌, వికారాబాద్‌ నియోజకవర్గంలోని ధారూరు మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు కల్పతరువుగా మారింది. అదే విధంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్‌ పట్టణానికి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పట్టణానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలోని శివారెడ్డిపేట వద్ద శివసాగర్‌ పేరుతో చెరువును తవ్వించారు. 1967లో ఈ చెరువు నిర్మాణం పూర్తిచేసుకుంది. ఈ చెరువే నేటికీ స్థానికుల దాహం తీరుస్తోంది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే చాలా గ్రామాలకు ఉన్న మట్టి రోడ్లను కంకర, బీటీ రోడ్లుగా మార్చి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చారని పెద్దలు గుర్తు చేస్తుంటారు. ప్రస్తుతం వికారాబాద్‌ పట్టణం ఎడ్యుకేషన్‌ హబ్‌గా పిలుస్తుంటారు. దీనికి కారణం విద్యకు తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వడంలో డాక్టర్‌.చెన్నారెడ్డి ఆనాడు వేసిన బీజమే. వికారాబాద్‌లో ఉన్నత విద్యావకాశాలను అప్పటి ప్రభుత్వాలు కల్పించకపోవడంతో 1965లోనే వికాస్‌ మండలిని స్థాపించి కళాశాలల ఏర్పాటునకు కృషిచేశారు. ఈ మండలికి మొదటి చైర్మన్‌గా ఆయనే వ్యవహరించారు. ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉండడంతో 1968లో శ్రీ అనంత పద్మనాభ (ఎస్‌ఏపీ) పీయూసీ కళాశాలను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిచే ప్రారంభింపచేశారు.

రాజకీయ ప్రస్థానం

1952, 1957 ఎన్నికల్లో మర్రి చెన్నారెడ్డి వికారాబాద్‌ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 1962లో ఎస్సీలకు రిజర్వు కావడంతో పక్క నియోజకవర్గమైన తాండూరు నుంచి పోటీచేశారు. 1962, 1967లలో తాండూరు నుంచి అసెంబ్లీకి వెళ్లారు. అనంతరం 1978లో మేడ్చల్‌ నుంచి పోటీచేసి గెలుపొంది ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో సనత్‌నగర్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. 1978–79, 1989–90లలో రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. ఈయన ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసేటప్పుడు అక్కడ శాంతిభద్రతల సమస్యలు తలెత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. దీంతో ఆయన రాష్ట్ర పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించారు. 27 ఏళ్ల పిన్నవయసులోనే బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ మినిస్టర్‌గా పనిచేసి రికార్డు సృష్టించారు. తమిళనాడు గవర్నర్‌గా ఉండగానే ఆయన కన్నుమూశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మర్పల్లి మండల కేంద్రంలోని నివాసం
1/3

మర్పల్లి మండల కేంద్రంలోని నివాసం

2/3

3/3

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement