గంభీరావుపేట(సిరిసిల్ల): నూతనంగా మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రీ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. గదులు, ఆటవస్తువులను పరిశీలించారు. క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్, ఎంఈవో గంగారాం, హెచ్‌ఎం శ్రీమతి తదితరులు ఉన్నారు.
పేదల అభ్యున్నతికే పథకాలు
ఇల్లంతకుంట: పేదల అభ్యున్నతికే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వం డబుల్‌బెడ్రూంలు నిర్మించినా ప్రజలకు అందజేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు ఆర్థికసాయం చేస్తుందన్నారు. అనంతరం సిరికొండ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ సురేశ్, మండల ప్రత్యేక అధికారి డీసీవో రామకృష్ణ, ఎంపీడీవో శశికళ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, సర్పంచులు మామిడి రాజు, గొడుగు విట్టల్, నేరెళ్ల విజయ్‌గౌడ్, కాత మల్లేశం, నాగరాజు, వోల్లాల రజిత, పండుగ సునీత, నాయిని నవీన్‌కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తీగల పుష్పలత, హౌసింగ్ ఏఈఈ ముజాఫర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
బోయినపల్లి: హైదరాబాద్‌లో ఈ నెల 12న జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని విలాసాగర్ హైస్కూల్ వి ద్యార్థి గోల్కొండ సృజన్‌కుమా ర్ ఎంపికై నట్లు పీడీ ప్రభాకర్ మంగళవారం తెలిపారు. ఈ నెల 1న సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగుపందెం అండర్–16 విభాగంలో సృజన్ ప్రతిభచాటి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు.
రామాలయాన్ని సందర్శించిన సినీ నటుడు
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని శ్రీసీతారామస్వామి ఆలయం, 700 ఏళ్లుగా ఆ రిపోని అఖండ జ్యోతిని సినీ నటుడు సీవీఎల్ నర్సింహారావు మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రాశస్త్యం గురించి కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆలయ గాలిగోపురం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.
నియామకం
సిరిసిల్లఅర్బన్: స్కౌట్, గైడ్స్ అర్గనైజేషన్(ఎస్‌జీవో) జిల్లా కమిషనర్‌గా మోతుకూరి అశోక్‌గౌడ్‌ను నియమిస్తున్నట్లు నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర కమిషనర్ అశోక్‌రాజ్ తెలిపారు. జిల్లాలో స్కౌట్, గైడ్స్ విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అశోక్ తెలిపారు.
వరద కాలువ నిర్మించాలి
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో కొత్తచెరువు వరదకాల్వను వెంటనే నిర్మించాలని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. కొత్తచెరువు మత్తడి నీరు పోయేందుకు శ్రీనగర్‌కాలనీ నుంచి కచ్చా కాలువ తీసి నాలుగేళ్లుగా వరదను మళ్లించడం జరుగుతుందన్నారు. పట్టణంలో కాల్వలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని కోరారు. మచ్చ అనసూర్య, గుజ్జ దేవదాస్, ఆకిన సత్తయ్య, పంతం సుజాత, గడదాసు లత పాల్గొన్నారు.


