వచ్చేది మన ప్రభుత్వమే.. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు అన్ని స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
సిరిసిల్ల: ‘మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యాను.. మంత్రిగా ఉండగా.. కొంత మేరకు అభివృద్ధి చేశాను.. 2028లో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. కేసీఆర్ నాయకత్వంలో ఇంతకు నాలుగింత అభివృద్ధిని చేస్తా’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో వీర్నపల్లి మండల కేంద్రం సర్పంచ్ మల్లారం జోత్స్న–అరుణ్‌కుమార్ మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరగా, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ, సిరిసిల్ల ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నేను గెలిచాను. కానీ, వేములవాడ, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఇప్పుడు గోస అనుభవిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో ఆటోకు డబ్బులిస్తే యూరియా బస్తాలు ఇంటికి వచ్చి పడేవని, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే, జిల్లాలో ఎవరూ ఊహించని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకు చెందిన పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ చేరారు. ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, నాయకులు గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, మాడుగుల మల్లేశంయాదవ్, గుగులోత్ రేణుక, కళావతి, కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతా
జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతిలో టాప్ మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు మంగళవారం సిరిసిల్ల బాలికల హైస్కూల్‌లో గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ట్యాబ్‌లు పంపిణీ చేసి మాట్లాడారు. తల్లిదండ్రులు గర్వపడేలా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ఇన్‌చార్జి కొండూరి సాంకేత్‌రావు, స్కూల్ హెచ్‌ఎం శారద, ఉపాధ్యాయుడు భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


