‘శాతవాహన’లో అగ్గువ ధరకే ఉద్యోగాలు ఇష్టానుసారంగా ఔట్ సోర్సింగ్ పోస్టుల విక్రయం ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షలకు బేరం 15 పోస్టులు సంతోషంగా విక్రయించినట్లు ఆరోపణలు వర్సిటీలో నేటి నుంచి ఎస్సీ కమిషన్ విచారణ మొదలు ఈ వారంలోనే కలెక్టర్, సీపీకి విచారణ నోటీసులు
శాతవాహన గాథలు–3
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
అర్బన్ నక్సలైట్లు, విద్యార్థుల ఆందోళనలు, దళితులపై వివక్ష తదితర వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న శాతవాహన యూనివర్సిటీలో మరో దుమారం చెలరేగుతోంది. యూనివర్సిటీలో అంతా తానై షాడో వీసీలా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ నియామకాల్లో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోస్టుకు ఇంత రేటు అంటూ ఫిక్స్ చేసి మరీ నియామకాల్లో అంతా తానై వ్యవహరిస్తున్నాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ నక్సలైట్లు, దళితులపై వివక్ష అన్న ఆరోపణలపై యూనివర్సిటీ మొత్తం రాజకీయ రణంగంగా మారింది. ప్రొఫెసర్ సుజాత వైపు కొందరు.. వీసీ ఉమేశ్ వైపు మరికొందరు చేరి ఎవరికి వారు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు.
సంతోషంగా విక్రయం..
అతను రాజకీయ పలుకుబడితో వర్సిటీలో చేరా డు. ఒక రకంగా అతనే షాడో వీసీ అన్న పేరుంది. అందుకే శాతవాహన యూనివర్సిటీలో ఎంత సీని యర్ ప్రొఫెసర్ అయినా సరే అతని జోలికి వెళ్లరు. అతను ఏం చెప్పినా.. స్థాయి మరిచి తూ.చా తప్పకుండా పాటిస్తారు. చిన్నస్థాయి ఉద్యోగుల విష యం చెప్పనక్కర్లేదు. పొరపాటున అతనికి వ్యతిరేకంగా స్వరం పెంచితే ఇక అంతే.. మరో విభాగాని కి బదిలీ చేసి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. అతని వ్యవహారం, పలుకుబడి తెలిశాక.. అతనితో అంతా అనివార్యంగా సఖ్యతగా ఉండాల్సి వస్తోంది. అలాంటి వ్యక్తి కొంతకాలంగా ఔట్‌సోర్సింగ్ కొలువుల భర్తీని సొమ్ము చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఇవేమీ పర్మినెంట్ పోస్టులు కావు. కాకపోతే నెల తిరిగే నాటికి జీతం ఠంఛన్‌గా వస్తుందన్న భరోసా ఉంది. అందుకే ఈ పోస్టులకు ఉన్న డిమాండ్‌తో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు తీసుకుని కొలువులు పెట్టిస్తున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 15కుపైగా పోస్టులు ఇలా తన పరపతితో సంతోషంగా అమ్ముకున్నాడన్న విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసింది. అయినా కీలక పోస్టుల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఉంచడంతో అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీలక పోస్టుల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ
మరోవైపు తనపై వ్యక్తిగత కక్షలతో అర్బన్ నక్సల్ అంటూ వేధించడం, వరుసగా పదవుల నుంచి తప్పించడంపై కలత చెందిన సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఇటీవల ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆదివారం వరకు వరుస సెలవుల నేపథ్యంలో ఈ విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారం నుంచి ఈ ఫిర్యాదుపై ఎస్సీ కమిషన్ విచారణ జరిపి, చర్యలు చేపట్టనుంది. తొలుత కరీంనగర్ కలెక్టర్, సీపీకి నోటీసులు జారీ చేయనున్నామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పీఏ శ్రీధర్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే ఈ వారంలో ఎస్సీ కమిషన్ సభ్యులు యూనివర్సిటీని సందర్శించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.


