కోనరావుపేట: బావుసాయిపేటలో..
వీర్నపల్లి: భావుసింగ్‌నాయక్ తండాలో నేలరాలిన వడ్లు
వీర్నపల్లి/కోనరావుపేట/చందుర్తి: జిల్లాలో మంగళవారం కురిసిన అకాలవర్షంతో పలుచోట్ల వరిపంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో కొందరు రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా, చేతికొచ్చిన పంట చేజారిపోయిందని పలువురు అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. వీర్నపల్లి మండలం బాబాయ్‌చెరువు తండా, భావుసింగ్‌నాయక్ తండా, భూక్య తండా, రంగంపేట తదితర గ్రామాల్లో కోతకు వచ్చిన వరిధాన్యం నేలపాలయింది. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట, కొండాపూర్ గ్రామాల్లో ధాన్యం రాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు బర్కం రమేశ్, నక్క మల్లేశం, కంటె సత్తయ్య, మ్యాకల రేవతి ప్రభుత్వాన్ని కోరారు. చందుర్తి మండలం తిమ్మాపూర్, ఆశిరెడ్డిపల్లె, రామన్నపేట గ్రామాల్లో గాలిపెల్లి వెంకటి, అట్టపల్లి సతీశ్, గడిగోప్పుల రాజశేఖర్, గాలిపల్లి సత్తయ్య తదితర రైతుల పొలాల్లో 30శాతానికి పైగా ధాన్యం రాలిపోవడంతో కుమిలిపోతున్నారు. పొలాలను పరిశీలించి ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


