● ఎస్పీ మహేశ్ బి గితే
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయంలో ఈ నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్ బి గితే అధికారులకు సూచించారు. మంగళవారం ఆలయ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లు, పార్కింగ్ సదుపాయాలపై దృష్టి సారించి, ట్రాఫిక్‌ను నియంత్రించేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు.
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ మహేశ్ బి గితే ఆదేశించారు. మంగళవారం వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించవద్దని, పెండింగ్ కేసులు వేగవంతంగా పూర్తి చేసి, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని, రోజూ డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వీరప్రసాద్, ఆలయ ఈఈ రాజేశ్, డిఈ రఘునందన్, రామ్ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


