ఓటెత్తిన మహిళా చైతన్యం | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన మహిళా చైతన్యం

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

ఓటెత్

ఓటెత్తిన మహిళా చైతన్యం

● ‘పుర’పోరు ప్రశాంతం ● సిరిసిల్లలో 77.55 శాతం ● వేములవాడలో 77.99 శాతం ● గతంలో కంటే తగ్గిన పోలింగ్‌ ● 2020 మున్సిపల్‌ ఎన్నికల్లో 81.38 శాతం ● 2014 ఎన్నికల్లో 80.36 శాతం ● వెల్లువెత్తిన మహిళా చైతన్యం ● రేపు ఓట్ల లెక్కింపు

● ‘పుర’పోరు ప్రశాంతం ● సిరిసిల్లలో 77.55 శాతం ● వేములవాడలో 77.99 శాతం ● గతంలో కంటే తగ్గిన పోలింగ్‌ ● 2020 మున్సిపల్‌ ఎన్నికల్లో 81.38 శాతం ● 2014 ఎన్నికల్లో 80.36 శాతం ● వెల్లువెత్తిన మహిళా చైతన్యం ● రేపు ఓట్ల లెక్కింపు

వేములవాడలో బారులుతీరిన మహిళలు

మున్సిపల్‌ ఓటర్లు పోలైనఓట్లు 9 గంటలు 11 గంటలు 1 గంట 3 గంటలు తుది ఓటింగ్‌

సిరిసిల్ల 81,959 63,562 8.01 23.14 43.57 61.17 77.55

వేములవాడ 40,877 31,881 14.06 35.35 55.68 69.69 77.99

మొత్తం 1,22,836 95,443 10.02 27.20 47.60 64.01 77.77

పోలింగ్‌ సరళి ఇదీ..

సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న ఘటనలు మినహా రీపోలింగ్‌ లేకుండా సాఫీగా సాగాయి. మహిళా ఓటర్ల చైతన్యం వెల్లువెత్తింది. సిరిసిల్లలో 77.55 శాతం, వేములవాడలో 77.99 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండు మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 1,22,836 మంది ఉండగా.. 95,443 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2020 మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలో 81.38 శాతం, 2014లో 80.36 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి 77.77 శాతానికి పడిపోయింది. సిరి సిల్లలో 39 వార్డులకు 170 మంది, వేములవాడలో 28 వార్డులకు 133 మంది బరిలో నిలిచారు. ఫలి తాలు రేపు తేలనున్నాయి. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డీఎస్పీ నాగేంద్రచారి పోలింగ్‌ సరళిని పరిశీలించారు.

నిదానంగా మొదలైన పోలింగ్‌

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోలింగ్‌ నిదానంగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైనా పెద్దగా ఓటర్లు ఎవరూ రాలేదు. 9 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల ముందు క్యూలైన్లు కనిపించాయి. 11 గంటల వరకు ఓటర్ల రద్దీ పెరిగింది. ఒంటి గంట వరకు సగం మంది ఓటర్లు వేశారు. సిరిసిల్లలో ఒక్కో వార్డుకు మూడు పోలింగ్‌ కేంద్రాలు, వేములవాడలో రెండు పోలింగ్‌ కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఐదు నుంచి పదిహేను నిమిషాల్లోపే ఓటు వేసి వెనుదిరగడం విశేషం.

పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి

సిరిసిల్లలో 117 పోలింగ్‌ కేంద్రాలు, వేములవాడలో 58 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుచరులతో సందడి చేశారు. ఓటర్ల వద్దకు ఆటోలు, కార్లను పంపించి కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని 175 పోలింగ్‌ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్‌ చేశారు.

చెదురుమదురు ఘటనలు

సిరిసిల్ల 39వ వార్డులో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. 30వ వార్డులోనూ బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగగా.. పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. వేములవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి తనను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించడం లేదని రోడ్డుపై బైఠాయించారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

వెల్లువెత్తిన మహిళా చైతన్యం

రెండు మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనడం విశేషం. సిరిసిల్లలో పురుషులు 30,466 మంది ఓటుహక్కు వినియోగించుకుంటే మహిళలు 33,091 మంది, ఇతరులు ఐదుగురు ఓటేశారు. పురుషుల ఓటింగ్‌ శాతం 76.28 ఉండగా.. మహిళల ఓటింగ్‌ శాతం 78.77 శాతం ఉంది. వేములవాడలో 14,801 మంది పురుషులు ఓట్లు వేయగా.. మహిళా ఓటర్లు 17,070, ఇతరులు 10 మంది వేశారు. ఇక్కడ పురుషుల ఓటింగ్‌ శాతం 75.59 ఉంటే.. మహిళా ఓటింగ్‌ శాతం 80.22 ఉంది.

రేపు ఓట్ల లెక్కింపు

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని సినారె కళామందిరాల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు సాగనుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రంలోని 39వ వార్డులో అధికార కాంగ్రెస్‌ పార్టీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు ముదిరి దాడుల వరకు వెళ్లింది. ఇరువర్గాల తోపులాటలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.

ఫలించని దొంగ ఓటు ప్రయత్నం

వార్డుకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడి భార్య రెండోసారి ఓటు వేయడానికి రావడంతో కాంగ్రెస్‌ ఏజెంట్లు అడ్డుచెప్పారు. అప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనకు దిగారు. దీంతో మహిళ రెండోసారి ఓటు వేయడానికి రావడంపై ఇరు పార్టీలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, దూషణలకు దిగారు. కొద్దిసేపు తోపులాటలు, కుమ్ములాటలతో ఆ ప్రాంతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటూ కాంగ్రెస్‌ సిరిసిల్ల ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు వచ్చి మహిళ రెండోసారి ఓటు వేయడానికి రాగా పోలింగ్‌ ఆఫీసర్‌ అనుమతించలేదన్నారు. దొంగ ఓట్లు వేయలేదని వివరించారు.

వేములవాడలో ప్రశాంతం

వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లు కనిపించాయి. 28 వార్డులకు 58 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 77.99 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆర్డీవో రాధాభాయి, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ తెలిపారు. కొన్ని వార్డుల్లో పోలింగ్‌శాతం 80 శాతం దాటగా, మరికొన్ని వార్డుల్లో సగటు పోలింగ్‌ 71.95 నమోదైంది. మూడో వార్డులో అత్యధికంగా 86.74 శాతం, 11వ వార్డులో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైంది.

ఏఎన్‌ఎంలతో మాట్లాడున్న అదనపు కలెక్టర్‌ నగేశ్‌

గోపాల్‌నగర్‌లో ఓటేసేందుకు వచ్చిన వృద్ధురాలు

ఓటెత్తిన మహిళా చైతన్యం1
1/5

ఓటెత్తిన మహిళా చైతన్యం

ఓటెత్తిన మహిళా చైతన్యం2
2/5

ఓటెత్తిన మహిళా చైతన్యం

ఓటెత్తిన మహిళా చైతన్యం3
3/5

ఓటెత్తిన మహిళా చైతన్యం

ఓటెత్తిన మహిళా చైతన్యం4
4/5

ఓటెత్తిన మహిళా చైతన్యం

ఓటెత్తిన మహిళా చైతన్యం5
5/5

ఓటెత్తిన మహిళా చైతన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement