డిమాండ్ల సాధనే లక్ష్యం
● నేడు శ్రామికుల దేశవ్యాప్త సమ్మె ● కార్మిక, వ్యవసాయ చట్టాల పరిరక్షణే ధ్యేయం ● ఏకతాటిపైకి ట్రేడ్ యూనియన్లు
సిరిసిల్లటౌన్: హక్కుల రక్షణ.. సమస్యల పరిష్కారం కోసం శ్రామికవర్గాలు గురువారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్రం ప్రభుత్వం కార్మిక, కర్షక చట్టాలను కుదించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అధిక ధరల తగ్గింపు ీతదితర డిమాండ్ల సాధనకు కార్మిక సంఘాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, అన్నిరంగాల కార్మికుల మద్దతుతో నేడు దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మినహా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాల్లో సమ్మె చేపట్టనున్నాయి. జిల్లాలో దాదాపు ఎనభైశాతం కార్మిక, కర్షక వర్గాలకు చెందిన వారున్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలో వస్త్రపరిశ్రమ విస్తరించి ఉండగా నేతకార్మిక కుటుంబాలు 16వేల వరకు ఉన్నాయి. దీనికితోడు బీడీ పరిశ్రమ సైతం విస్తరించి ఉంది. కార్మిక, కర్షక ఖిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మికచట్టాల రద్దుపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సైతం పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాయి. వస్త్రపరిశ్రమలో పనిచేస్తున్న వార్పిన్, కాటన్‌వస్త్రం, పాలిస్టర్‌వస్త్రం ఉత్పత్తి కార్మికుల కూలీ ఒప్పందానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ ఉంది.
కార్మికుల వివరాలు(సుమారు)
బీడీ 86,000
పవర్‌లూమ్ 15,000
గ్రామపంచాయతీ 1,300
అంగన్‌వాడీలు 500
ఆశకార్యకర్తలు 450
మున్సిపల్ 700
గార్మెంట్స్ 1,300
హమాలీ 2,500
మధ్యాహ్నం భోజనం 600
రైతులు 1,13,000 భవన కార్మికులు 5,000


