మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పరిశీలన
వేములవాడ: మహాశివరాత్రి జాతరలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి భక్తులకు సాఫీగా స్వామివారికి దర్శనం చేయించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌సాయి, ఆర్డీవో రాధాబాయి ఆలయ అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను మంగళవారం రాత్రి భీమన్న ఆలయంలో పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, డీఈ మైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మహా’ జాతరలో మెరుగైన వైద్యసేవలు
సిరిసిల్ల: వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో మంగళవారం వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. శనివారం నుంచి సోమవారం వరకు వేములవాడలో జాతర సందర్భంగా మూడు రోజుల పాటు రేయింబవళ్లు విధుల్లో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని కోరారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకుని భక్తులకు వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులు సంపత్, రామకృష్ణ, అనిత, నయిమా జహా, జిల్లాలోని పీహెచ్‌సీల డాక్టర్లు, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పరిశీలన


