ఓటు విలువ పెరిగింది!
● ఓటుకు రూ.5వేలు.. మందు బాటిల్, స్వీట్ బాక్స్‌లు, వెండి రింగులు అదనం ● అంతా గప్ చుప్ ప్రచారం ● కాళ్లు మొక్కుతూ.. నోట్లు ఇస్తూ.. ● జిల్లాలో పొరుగు రాష్ట్రాల మద్యం పంపిణీ ● సిరిసిల్ల, వేములవాడలో విందులే విందులు
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలు ఖరీదైపోయాయి. గతానికి భిన్నంగా ఈసారి ఓటు విలువను అభ్యర్థులు పోటాపోటీగా పెంచేశారు. ఓటర్లకు నోట్లు ఇస్తూ.. కాళ్లు మొక్కుతూ.. ఓటును అభ్యర్థించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మంగళవారం రోజంతా ఎన్నికల ప్రచారం అంతా గప్‌చుప్‌గా సాగింది. మైక్‌లు లేకుండా ప్రచార ఆర్భాటం లేకుండా.. అభ్యర్థులు వారి అనుయాయులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రలోభాలను గుమ్మరించారు. సోమవారం రాత్రి ఓ అభ్యర్థి ఓటర్లకు రూ.3వేల చొప్పున ఇవ్వడంతో తెల్లారేసరికి అదే వార్డుకు చెందిన మరో ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటుకు రూ.5వేల చొప్పున పంపిణీ ప్రారంభించారు. దీంతో తొలుత పంపిణీ ప్రారంభించిన అభ్యర్థి మళ్లీ తిరిగి రూ.2వేలు చొప్పున అందిస్తూ.. మందు బాటిళ్లు, స్వీట్ బాక్స్‌లు ఇచ్చారు. ఎన్నికలకు ఒక్కరోజు ముందు కావడంతో అభ్యర్థులంతా పెద్ద ఎత్తున డబ్బులు పంచుతూ గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు తెగాయి. యువకులకు మందు, విందులు ఇచ్చారు. కొందరైతే ఇంటికో ఫుల్‌బాటిల్ పంపారు. మరికొందరు అభ్యర్థులు మాంసహారాన్ని సైతం వంట చేయించి మరి ఇంటింటికి పంపించారు. సిరిసిల్ల, వేములవాడల్లో 67 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు అంతా రహస్య ప్రచారం చేశారు. కొన్ని వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఏ మాత్రం తగ్గకుండా ప్రలోభాలకు పోటీగా తెరలేపారు.
ఓటర్లకు పొరుగు రాష్ట్రాల మద్యం
జిల్లాలో పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారింది. గోవా, చండీగఢ్, పాండిచ్చెరీ వంటి ప్రాంతాలకు చెందిన పన్నుల రహిత మద్యాన్ని దిగుమతి చేసి పంపిణీ చేశారు. తక్కువ ధరకే పొరుగు రాష్ట్రాల మద్యాన్ని ఎన్నికల కోసం తెప్పించి పంపిణీ చేయడం సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు రోజు ఎక్కడా చూసిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా విందులు ఇచ్చారు. కొందరు అభ్యర్థులు ఖరీదైన చీరలు, వెండి నాణేలు, వెండి రింగులు అందిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కోక్కరు సగటున రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చించడం విశేషం. ఏది ఏమైనా నేడు ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.


