పటిష్ట బందోబస్తు
● స్వేచ్ఛగా ఓటేయాలి ● మూడు అంచెల్లో పోలీస్ రక్షణ ● 811 మంది పోలీసులు, రెండు ప్లటూన్ల బలగాలతో భద్రత ● అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ● 131 మంది పాత నేరస్తుల బైండోవర్ ● ‘సాక్షి’తో ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మూడు అంచెల్లో పోలీసు రక్షణ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో బందోబస్తు ఏర్పాట్లు, జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలను, ఎన్నికల నిర్వహణ ప్రణాళికను ‘సాక్షి’కి సోమవారం వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై నిఘా
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల్లో 117 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 34 సెన్సిటివ్, 11 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వేములవాడలో 28 వార్డుల్లో 58 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 14 సెన్సిటివ్, 6 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సున్నితమైన కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. రెండు మున్సిపాలిటీల్లోని 175 పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. మొబైల్‌ఫోన్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించం.
నిరంతరం తనిఖీలు
ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే జనవరి 27 నుంచి జిల్లాలో ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. సిరిసిల్ల పరిధిలో మూడు, వేములవాడ పరిధిలో మూడు చెక్‌పోస్టుల్లో రేయింబవళ్లు తనిఖీలు నిర్వహించాం. మరో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఒక్కో పట్టణంలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేశాం. ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులకు నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించాం. ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించాం. డబ్బులు, మద్యం ప్రభావాన్ని కట్టడి చేసేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రూట్ మొబైల్ పార్టీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి.
అనుమానితుల బైండోవర్
నేరచరిత గల అనుమానితులను 131 మందిని ముందుజాగ్రత్తగా బైండోవర్ చేశాం. చెక్‌పోస్టు తనిఖీల్లో ఇప్పటికే రూ.31.70 లక్షల నగదు, 2.4 కిలోల వెండిని సీజ్ చేశాం. 21 కేసులు మద్యం(238 లీటర్లు) పట్టుకున్నాం. పట్టణాల పరిధిలో పలు బెల్ట్‌షాపులను సీజ్ చేశాం. జిల్లాలో లైసెన్స్ ఉన్న వారి ఆయుధాలను డిపాజిట్ చేయించుకున్నాం.
మూడు అంచెల్లో బందోబస్తు
మూడు అంచెల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 811 మంది పోలీసులు, రెండు ప్లటూ న్ల టీజీఎస్‌ఎఫ్ సాయుధ బలగాలతో ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల వరకు ఎవ రూ ప్రచారం చేయరాదు. రెండు, మూడు పో లింగ్ కేంద్రాలను కలిపి ఒక్క ఎస్సై పర్యవేక్షణ లో ఉంటుంది. సిరిసిల్లలో 8, వేములవాడలో 6 జోన్లుగా విభజించాం. సీఐల పర్యవేక్షణలో స్ట్రై కింగ్‌ఫోర్స్ ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడల్లో డీఎస్పీల ఆధ్వర్యంలో రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది.
స్వేచ్ఛగా ఓటేయాలి
ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లు వేయాలి. ఎన్నికల నేపథ్యంలో 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు అమలులో ఉంటుంది. ఎన్నికలు జరిగే 11వ తేదీ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పోలీస్ ఆంక్షలు అమలులో ఉంటాయి. డయల్ 100కు ఫిర్యాదు చేయవచ్చు. ఎస్పీ ఆఫీస్‌లో ఒకటి, కలెక్టరేట్‌లో మరో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైనా చేయవచ్చు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు పోలీసులకు సహకరించాలి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల సిబ్బందితో కలిసి పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది.
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ భద్రత
సిరిసిల్ల, వేములవాడల్లోని సినారె కళామందిరాల్లో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశాం. ఎన్నికలు ముగియగానే అక్కడే బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరుస్తాం. 13వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశాం. అక్కడ సైతం మూడు అంచెల్లో పోలీస్ రక్షణ చర్యలు తీసుకుంటాం. ఎన్నికల అధికారులు జారీ చేసిన పాసులు ఉన్న వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తాం.
పటిష్ట బందోబస్తు


