రూట్ మార్చిన దొంగలు
బోయినపల్లి(చొప్పదండి)/ఇల్లంతకుంట(మానకొండూర్): దొంగలు రూట్ మార్చారు! సాధారణంగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడడం పరిపాటి. కానీ ఇటీవల తమ టార్గెట్ వ్యవసాయబావులు, బోర్లు, ఆలయాలను ఎంచుకుంటున్నారు. గ్రామంలో ఉండే ఇళ్ల కంటే శివారు ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీ చేయడం సులభంగా భావించి ఉంటారు. జిల్లాలో ఇటీవల జరిగిన పలు సంఘటనలు పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.
వరుస చోరీలు
బోయినపల్లి మండలంలోని తడగొండకు చెందిన చెట్టుకింది చంద్రశేఖర్, గోగూరి దామోదర్‌రెడ్డి, దయ్యాల చంద్రశేఖర్, కొమురయ్య, గంగారెడ్డి వంటి దాదాపు 20 మంది రైతుల విద్యుత్‌తీగలను ఈనెల 2న గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.
● వారం క్రితం విలాసాగర్ జీపీ స్టార్టర్ డబ్బ నుంచి 50 మీటర్ల వైరు చోరీ చేశారు. అదే గ్రామానికి చెందిన పైండ్ల చందు పొలం వద్ద వంద మీటర్ల వైరు ఎత్తుకెళ్లారు. బాలపోచయ్యకు చెందిన విద్యుత్‌తీగలు చోరీ చేశారు. సెస్ సంస్థకు రూ.లక్ష వరకు నష్టం వచ్చింది.
● కొదురుపాక, వెంకట్రావుపల్లి పరిసరాల్లో 2025 ఏప్రిల్‌లో 6వేల మీటర్లకు పైగా అల్యూమినియం విద్యుత్ వైర్ ఎత్తుకెళ్లారు. నీలోజిపల్లి శ్మశానవాటిక, ఎస్సీకాలనీల్లో విద్యుత్‌పోల్స్‌కు బిగించిన వైరును సైతం ఎత్తుకెళ్లారు. విద్యుత్ తీగలు ఎత్తుకెళ్లడంతో దహన సంస్కారాల సమయంలో ఇబ్బంది అవుతుందని గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్ సెస్ చైర్మన్, ఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో కొత్త వైర్‌ను బిగింపజేశారు.
ఆలయాలే టార్గెట్
ఇల్లంతకుంట మండలంలోని ఆలయాలను టార్గెట్ చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయాలు ఊరి శివారులో ఉండడం.. అక్కడ ఎవరూ ఉండకపోవడంతో దొంగలకు కలిసొస్తుంది. దొంగల బెడదను తట్టుకోలేక పలు గ్రామాల్లో రాత్రి వేళ కాపలా ఉంటున్నారు. మండలంలోని వెల్జీపురంలో 15 రోజుల క్రితం ఎల్లమ్మగుడి, అదే గ్రామంలోని పెద్దమ్మగుడిలో దొంగలుపడ్డారు. అమ్మవార్ల పుస్తెలు, మెట్టెలు ఎత్తుకెళ్లారు. హుండీలను కూడా దొంగలించారు. అదే గ్రామంలోని నలుగురు రైతుల వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్‌ల నుంచి బోరుమోటార్ వరకు ఉండే విద్యుత్‌తీగలను కట్ చేసి ఎత్తుకెళ్లారు. వారం క్రితం ముస్కానిపేటలో ఓ ఇంటిలో పట్టపగలే దొంగలు పడి మూడు తులాల బంగారం, రూ.50వేల నగదు దోచుకెళ్లారు. గత జనవరి 25వ తేదీ రాత్రి ఎర్రనర్సుపల్లెలోని పెద్దమ్మగుడిలో పుస్తె, మెట్టెలు ఎత్తుకెళ్లారు. అదేరోజు ఎర్రనర్సుపల్లి, రహీంఖాన్‌పేట గ్రామపంచాయతీల నల్లాల బావి మోటార్‌వైర్‌తోపాటు గ్రామంలోని ఐదుగురు రైతుల వ్యవసాయ బోరు మోటర్ల వైర్ కట్ చేసి తీసుకెళ్లారు. తాజాగా జనవరి 31వ తేదీ రాత్రి రహీంఖాన్‌పేట ఎల్లమ్మగుడి, ఇల్లంతకుంట పెద్దమ్మ గుడిలో దొంగలు పడి పుస్తె, మెట్టెలు ఎత్తుకెళ్లారు.


