నమ్మకు నమ్మకు ఈ రేయిని!
తుది విడత ఎన్నికలు ఇలా...
బహిరంగ ప్రచారం బంద్
ఓట్ల వేటకు నోట్ల పంపిణీ
రేపు తుదివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు
80 గ్రామాల్లో 551 వార్డులు..
సర్పంచ్ బరిలో 380 మంది
రేపు నాలుగు మండలాల్లో ఎన్నికలు
సిరిసిల్ల: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మూడో విడత నాలుగు మండలాల్లో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో సోమవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ప్రచారం నిలిచిపోవడంతో అభ్యర్థులు ఓట్లను కొనేందుకు అనుచరులు, అనుయాయులను కలుపుకొని నోట్లకట్టలతో బయలుదేరారు. ఇప్పటికే గ్రామాల్లో మందు పొంగిపొర్లుతుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉండడంతో అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే.. రేపు సాయంత్రానికి గెలుపోటములు తేలిపోతాయి.
నోట్ల పంపిణీకి ఓ లెక్కుంది..
జిల్లాలోని మూడో విడతలో ప్రధానంగా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓట్లు రాబట్టాలంటే నోట్లు పంపిణీ చేయాల్సిందేనన్న అభిప్రాయంలో అభ్యర్థులు ఉన్నారు. దానికో లెక్క పెట్టుకున్నారు. ప్రత్యర్థి ఎంత పంపిణీ చేస్తున్నాడో తెలుసుకొని.. అంతకుమించి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా.. గుట్టుచప్పుడు కాకుండా చేయడం విశేషం. ఇప్పటికే కులసంఘాలను, యువజన సంఘాలను, మహిళా సంఘాలను మచ్చిక చేసుకుని ఓట్లు పొందేలా తీవ్ర ప్రయత్నాలు చేశారు.
నేడు పోలింగ్ కేంద్రాలకు తరలనున్న సిబ్బంది
తుది విడత పంచాయతీ ఎన్నికలకు 914 మంది(పీవో) ప్రిసైడింగ్ అధికారులు, 1,244 మంది(ఓపీవోలు) విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల సామగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేదుకు ఆయా మండల కేంద్రాల్లో సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా నాలుగు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తరలివెళ్లనున్నారు. సమస్యాత్మక గ్రామాలు, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన పోలీస్ భద్రతను కల్పించేందుకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. పోలింగ్ సిబ్బందితో పాటే.. పోలీసులు ఆయా గ్రామాలకు చేరనున్నారు.
గ్రామాలు 80, వార్డుస్థానాలు 380
ఓటర్లు ఇలా..
మండలం ఓటర్లు
గంభీరావుపేట 36,807
ముస్తాబాద్ 38,500
వీర్నపల్లి 11,727
ఎల్లారెడ్డిపేట 40,886
ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 87 గ్రామపంచాయతీలు ఉండగా.. ఇప్పటికే 7 గ్రామాలు ఏకగీవ్రమయ్యాయి. మిగిలిన 80 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు, 551 వార్డుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


