భూముల వివరాలు పక్కాగా ఉండాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: భూభారతిలోని భూముల వివరాలు పక్కాగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం భూభారతిపై సమీక్షించారు. భూ భారతి, సాదాబైనామా, రెవె న్యూసదస్సుల దరఖాస్తులు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల స్థితిగతులపై ఇన్‌చార్జి కలెక్టర్ ఆరా తీశారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, పర్యవేక్షకులు వేణు, సురేశ్ పాల్గొన్నారు.
అమృత్ పనులు పూర్తి చేయాలి
జిల్లాలో అమృత్ 2.0లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏ–యూడీ) సెక్రటరీ శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్), మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అమృత్ 2.0 పనులపై ప్రతీవారం సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రూ.100కోట్లతో చేపట్టిన నీటి ట్యాంకులు, పైప్‌లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో రూ.13కోట్లతో చేపట్టిన పనుల పురోగతిపై అభినందించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, అన్వేశ్, పబ్లిక్ హెల్త్ డీఈ వరుణ్ పాల్గొన్నారు.


